Elevated Corridor in Hyderabad to Srisailam Highway :నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణపై కేంద్ర ఉపరితల రవాణా శాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దృష్టి సారించింది. హైవేలో మన్ననూరు నుంచి పాతాళగంగ వరకు రోడ్డు విస్తరణ కోసం 147.31 హెక్టార్ల భూమి అవసరమని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు నల్లమల అటవీ ప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వు మీదుగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రాష్ట్ర అటవీ శాఖతో సమావేశమయ్యారు.
రోడ్డు విస్తరణ ప్రాజెక్టు గురించి వారికి వివరించారు. అరణ్య భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో అటవీ శాఖ నుంచి పీసీసీఎఫ్ (హెచ్‌ఓఎఫ్‌ఎఫ్) ఆర్.ఎం.డోబ్రియల్, పీసీసీఎఫ్ (వైల్డ్‌లైఫ్) ఎలూసింగ్ మేరు పలువురు హాజరయ్యారు. హైవే-756లో హైదరాబాద్-శ్రీశైలం సెక్షన్ మధ్య ప్రస్తుత ట్రాఫిక్, రానున్న కాలంలో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకొని 2 వరుసలను 4 లేన్లుగా విస్తరించే ప్రణాళికను వారికి వివరించారు. వన్యప్రాణులు తిరిగే ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామని, మిగతా చోట భూ భాగంలోనే రోడ్డును విస్తరిస్తామని పేర్కొన్నారు. ఎలివేటెడ్ కారిడార్ దాదాపు 30 అడుగుల ఎత్తులో ఉండే అవకాశం ఉందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాద్-శ్రీశైలం మార్గంలో 128.6 కి.మీ. నుంచి 191 కి.మీ. వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్టును ప్రతిపాదించారు.
అటవీ భూమి కావాలని ప్రతిపాదన :మన్ననూరుకు ముందున్న బ్రాహ్మణపల్లి ప్రాంతం నుంచి పాతాళగంగ వరకు తెలంగాణ పరిధిలో వరకు జాతీయ రహదారిని విస్తరణ చేపడతారు. పాతాళగంగ తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వస్తుంది. తెలంగాణలో 62.5 కి.మీ. మేర రహదారిని విస్తరించాలన్నది ప్రణాళిక కాగా ఇందులో 45.42 కి.మీ. మేర ఎలివేటెడ్ కారిడార్ వస్తుందని కేంద్ర ఉపరితల రవాణా, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు అటవీశాఖకు వివరించారు. రోడ్డు విస్తరణకు అవసరమయ్యే భూమి విషయమై అధికారులు క్షేత్రస్థాయి సర్వే చేసి నల్లమల అటవీప్రాంతం, అమ్రాబాద్ టైగర్ రిజర్వులో అటవీ భూమి కావాలని అధికారులు అటవీశాఖకు తెలిపారు.
నాగార్జునసాగర్ టూ శ్రీశైలం 'లాంచీ ప్రయాణం' షురూ - టికెట్ ధరలు సహా పూర్తి వివరాలివే