ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీ కేర్​ఫుల్ గురూ - ఆన్​లైన్ గేమింగ్ ఉచ్చు - మీ జీవితాలను ఏమార్చు - ONLINE GAMING EFFECTS

ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసలైన విద్యార్థులు, యువత - మానసిక వ్యాధుల బారిన పడుతున్న వైనం

Online Gaming Addiction
Online Gaming Addiction (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 1, 2025, 7:17 AM IST

Online Gaming Effects : సెల్​ఫోన్​లో ఆన్‌లైన్‌ గేమింగ్‌కు విద్యార్థులు, యువత బానిసలుగా మారుతున్నారు. ఈ వ్యసనం ప్రమాదకర స్థితికి చేరిందనడానికి విశాఖపట్నంలో తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణ. ఆన్‌లైన్‌ గేమ్స్‌ వద్దని బీటెక్‌ చదువుతున్న అన్‌మోల్‌ సింగ్‌ను తల్లి అల్కాసింగ్‌ మందలించారు. ల్యాప్‌టాప్‌ ఇచ్చేయాలంటూ పెనుగులాటకు దిగిన కుమారుడు చివరకు తల్లినే కత్తితో పొడిచి చంపేశాడు. గంటపాటు చేతిలో మొబైల్ లేకపోతే పిల్లల మానసిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. తమిళనాడు సర్కార్ వీటి నియంత్రణకు అడుగులు వేసినట్లే, ఆమోదించిన గేమ్‌లే మార్కెట్‌లోకి వచ్చేలా ఏపీలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.

రక్తబంధాన్నే చంపే ఫోన్‌ రుగ్మత : విశాఖలో ఓ విద్యార్థి తనకంటే పెద్దవాళ్లతో పరిచయాలు పెంచుకున్నాడు. తొమ్మిదోతరగతిలో చదువు మానేసి వాళ్లతో కలిసి చిన్న చిన్న పనులు చేస్తూ మొబైల్ కొన్నాడు. తండ్రి లేకపోవడంతో తల్లి కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించేది. ఆ అబ్బాయి రాత్రిళ్లు ఆలస్యంగా ఇంటికి రావడం, వచ్చినప్పటి నుంచి సెల్​ఫోన్​లో మునిగిపోవడం తట్టుకోలేక తల్లి రోజూ వారించేది. ఇంటర్‌ వయసుకు వచ్చిన ఆ విద్యార్థి తల్లి తిట్టిందని ఒకరోజు ఆమెను గుండెలపై కొట్టి, గొంతు నులిమి చంపేశాడు. ప్రస్తుతం పట్టించుకునేవారెవ్వరూ లేక అతను మానసిక రోగిలా మారిపోయాడు.

భయపెడుతున్న సర్వేలు : వార్షిక విద్యాస్థాయి నివేదిక (అసర్‌)లో చూస్తే 14 సంవత్సరాల పిల్లల్లో 81.4 శాతం, 15 ఏళ్ల పిల్లల్లో 82.2 శాతం, 16 సంవత్సరాల వారిలో 84.4 శాతం సోషల్ మీడియా కోసం మొబైల్ వినియోగిస్తున్నారు. గతేడాది దేశవ్యాప్తంగా చేసిన సర్వేలోనూ 60 శాతం పట్టణ పిల్లలు రోజూ మూడు గంటలపాటు ఆన్‌లైన్‌ గేమింగ్, సామాజిక మాధ్యమాలు, ఓటీటీల్లో గడుపుతున్నట్లు తేలింది. ఛాలెంజ్, ఫైర్‌ ఫెయిరీ, ఐదు వేళ్ల ఫిల్లెట్, కటింగ్‌ ఛాలెంజ్, బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ ఇండియా, పబ్‌జీ, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ, జీటీఏ, బ్లూవేల్‌ ఫ్రీఫైర్, గ్రాంట్‌ తెఫ్ట్‌ ఆటో, రోబోలాక్స్‌ లాంటి చాలా గేమ్‌లు ఆన్‌లైన్​లో ఆడుతూ విద్యార్థులు వాటికి బానిసలుగా మారుతున్నారు.

ఇలా పిల్లల్ని వెనకేసుకొస్తే కష్టమే : విశాఖలో ఓ అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ పిల్లలు సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆన్‌లైన్‌ గేమ్‌లో మునిగిపోయేవారు. నెల క్రితం వాచ్‌మన్‌ ఇంటివద్ద ఏదో అయినట్లు బిగ్గరగా అరుపులు వినిపించాయి. ఏమైందని అపార్ట్‌మెంట్‌లోని వారు కిందకు వెళ్లి చూస్తే సెల్​ఫోన్​లో గేమ్‌ ఆడుతూ ఆ ఆటలో వచ్చే ఆదేశాలను పాటిస్తున్నట్లు గుర్తించారు. మావోడు అరవడం లేదమ్మా అది గేమ్ అంట అని తల్లి వెనకేసుకొచ్చింది. అపార్ట్‌మెంట్‌లోని కొందరు ఆ పేరెంట్స్​ను మందలించగా వాళ్లు ఆడుకుంటున్నారమ్మా మీరు అలా అనకండి అంటూ తల్లిదండ్రులు మద్దతివ్వడం చూసి అక్కడున్న ఓ అధికారిణి నివ్వెరపోయారు.

తల్లిదండ్రులు కనిపెట్టాలి : పిల్లలు ఏం చేస్తున్నారనేది తల్లిదండ్రులు కనిపెట్టాలని సైకాలజిస్టు అండ్ కౌన్సెలర్ మాధవి గణపతి తెలిపారు. పిల్లలు అడిగారని రూ.20,000ల ఫోన్లు ఇస్తున్నారని చెప్పారు. చిన్నారులపై తల్లిదండ్రులు జవాబుదారీతనం కోల్పోతున్నారని పేర్కొన్నారు. పేరెంట్స్​కు కౌన్సెలింగ్‌ అవసరమని వివరించారు. వాదులాడితేనో, దెబ్బలాడితేనో పిల్లలు మాట వినరని నువ్వు చేసింది తప్పు, దీనివల్ల నష్టం కలుగుతుందని అర్థం చేసుకునేలా చెబితే కొంత సమయం పట్టినా దారికొస్తారని వెల్లడించారు. ప్రస్తుత తల్లిదండ్రులకు అంత సమయం, సహనం లేదని ఒకేసారి మారాలన్నట్లు ప్రవర్తిస్తున్నట్లు మాధవి గణపతి తెలియజేశారు.

Online gaming: యువకుడి ఉసురు తీసిన.. ఆన్​ లైన్​ గేమ్​..

మొబైల్​ గేమింగ్​కు బాలుడు బలి!

ABOUT THE AUTHOR

...view details