Ambati Rambabu on YSRCP Defeat : ఏపీలో మరోసారి జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అవుతారనుకున్నామని వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కానీ ఓడిపోయామని చెప్పారు. అలా ఇలా కాదని ఘోరంగా ఓటమి పాలయ్యామని పేర్కొన్నారు. కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకున్నామని వివరించారు. ఈ సందర్భంగా ఓటమిని ఒప్పుకోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. అనకాపల్లి జిల్లా కశింకోటలో శుక్రవారం వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
వైఎస్సార్సీపీకి 11 సీట్లు ఎందుకు వచ్చాయో అర్థం కాలేదని అంబటి రాంబాబు పేర్కొన్నారు. పోనీ తమకు అర్థం కాలేదంటే పర్వాలేదు కానీ కూటమికి 164 సీట్లు ఎందుకు వచ్చాయో వారికీ తెలియడం లేదని వ్యాఖ్యానించారు. ఇద్దరు, ముగ్గురు కలవడం వల్ల అన్ని సీట్లు వచ్చాయా? వైఎస్సార్సీపీపై తెలియని వ్యతిరేకత ఏమైనా ఉందా? లేకపోతే ఏదైనా మాయ జరిగిందా? అన్న అనుమానాలు ఉన్నాయని అంబటి చెప్పారు.
ఏదేమైనా ఓటమి పాలయ్యామని అంబటి తెలిపారు. పంట సరిగా పండలేదని తిరిగి వ్యవసాయం చేయాలన్నారు. పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగానే జగన్ చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని అనకాపల్లి పార్లమెంట్ ఇంఛార్జ్‌గా నియమించారని చెప్పారు. ఇకనైనా నేతలు, కార్యకర్తల మధ్య విభేదాలు ఉంటే పక్కన పెట్టాలని సూచించారు. మరోవైపు కూటమి ప్రభుత్వ ఎనిమిది నెలల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని అంబటి వ్యాఖ్యానించారు.
"మాకు 11 సీట్లు ఎందుకు వచ్చాయో అర్థం కాకపోయినా పర్వాలేదు. కూటమికి 164 సీట్లు ఎందుకు వచ్చాయో వారికీ అర్థం కావడం లేదు. ఇద్దరు ముగ్గురు కలవడం వల్ల అన్ని సీట్లు వచ్చాయా? లేదా వైఎస్సార్సీపీకి తెలియని వ్యతిరేకత ఏమైనా ఉందా? లేకపోతే ఏదైనా మాయ జరిగిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏమైనా ఓటమి పాలయ్యా. తిరిగి పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం నాయకులు, కార్యకర్తలపై ఉంది." - అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి
నాయకులు, కార్యకర్తలు మధ్య సమన్వయం లోపిస్తుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దీన్ని విడనాడాలని తెలిపారు.
ఇరువురూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. శ్రేణులను గుర్తిస్తేనే పార్టీ ముందుకు వెళ్తుందన్నారు. మరోవైపు వైఎస్సార్సీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా కృషి చేస్తానని కరణం ధర్మశ్రీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వరుదు కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
పోలీసు విధులకు ఆటంకం - అంబటి రాంబాబు, వైఎస్సార్సీపీ నేతలపై కేసు నమోదు
"సంస్కారహీనంగా మాట్లాడారు" - అంబటి, కొడాలి నాని, రోజాపై ఫిర్యాదు