AP Land Registration Charges Hike : వైఎస్సార్సీపీ సర్కార్ అడ్డగోలుగా పెంచిన భూముల రిజిస్ట్రేషన్ విలువను సవరిస్తూ కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్ విలువలను సవరించింది. కొత్త ధరలు ఇవాళ్టి నుంచి అమలులోకి వచ్చాయి. నివాస స్థలాలు, వాణిజ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల ప్రాతిపదికన విలువలు సవరించారు. గుంటూరు జిల్లాలో కొన్ని చోట్ల అధికంగా ఉన్న విలువలను తగ్గించారు. గుంటూరు శివారు నల్లపాడు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో ఎకరా పొలం రిజిస్ట్రేషన్ విలువ రూ.1.96 కోట్లు ఉండగా దాన్ని రూ.30 లక్షలు చేశారు. సుద్దపల్లి డొంకలో ఎకరా పొలం రూ.4.35 కోట్లు ఉండగా దాన్ని రూ.1.99 కోట్లకు తగ్గించారు.
విజయవాడలో 3 శాతం నుంచి 9 శాతం వరకు విలువలు పెరిగాయి. విశాఖలోనూ పలు ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి. అనకాపల్లిలో రిజిస్ట్రేషన్ విలువలు యథాతథంగా ఉంచి జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో 24 శాతం నుంచి 32 శాతం వరకు పెంచారు. కాకినాడలో కొన్ని ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా గుర్తించి వైఎస్సార్సీపీ హయాంలో గజం ధరను రూ.42,000లుగా ఖరారు చేయగా దీన్ని ఇప్పుడు రూ.22,000లకు తగ్గించారు. అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ విలువలు పెరిగాయి.
Registration Charges Hike in AP : భూములు రిజిస్ట్రేషన్ విలువలు పెరగడానికి ముందే కార్యాలయాలకు తాకిడి పెరిగింది. గురు, శుక్రవారాల్లో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు జనం పోటెత్తారు. ఒక్కసారిగా ఒత్తిడి పెరగడంతో చాలా చోట్ల సర్వర్లు నెమ్మదిగా పనిచేశాయి. రిజిస్ట్రేషన్లు ఆలస్యంగా జరిగాయి. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారు ఇబ్బందులు పడ్డారు. పాత విలువలకు చివరి రోజు కావడంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు పోటెత్తారు.
సర్వర్ సమస్యలు, రద్దీ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల రాత్రి 11 గంటల వరకూ రిజిస్ట్రేషన్లు జరిగాయి. పలు చోట్ల రాత్రి 8 దాటాక కూడా నడవలేని వృద్ధులను ఆటోల్లో కార్యాలయాలకు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. సర్వర్ మొరాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు సామర్థ్యం పెంచాలని కోరారు. చాలా మంది భూముల రిజిస్ట్రేషన్లకు ముందుగానే చలాన్లు తీసినా శుక్రవారం చేయించుకోలేకపోయారు. అధిక రద్దీతోపాటు సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఉసూరుమంటూ ఇంటిదారి పట్టారు. పాత ధరలతో రిజిస్ట్రేషన్లు చేస్తారా లేదా కొత్త విలువలు అమలవుతాయా అనే సందేహాలు వ్యక్తం చేశారు.
కిక్కిరిసిన రిజిస్ట్రేషన్ కార్యాలయాలు - రెండు రోజుల్లో భారీగా ఆదాయం