Easy Immigration at Shamshabad Airport :శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలను అందించేందుకు కేంద్ర పౌర విమానయాన సంస్థ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖలు ప్రవేశపెట్టిన ఫాస్ట్‌ట్రాక్ ఇమిగ్రేషన్, డిజియాత్రలు మంచి ఫలితాలు ఇస్తున్నాయి. బోర్డింగ్ పాస్ కౌంటర్ల వద్ద రద్దీ నియంత్రణ, సులువుగా ఇమ్మిగ్రేషన్ పూర్తి చేసేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. ఫాస్ట్‌ట్రాక్ ఇమ్మిగ్రేషన్ విధానాన్ని జనవరి నెలలో ప్రారంభం చేశారు. తద్వారా విమాన ప్రయాణికులకు 20 నుంచి 30 నిముషాల టైం ఆదా అవుతోందని, బోర్డింగ్ పాస్ కౌంటర్ల వద్ద అధిక మంది ఉంటే, ప్రయాణికులు ఎక్కాల్సిన విమానం చెక్-ఇన్ పూర్తి అవుతుందేమోనన్న ఆందోళన అవసరం లేదని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు.
తమ పేర్లను నెల రోజుల ముందు నమోదు చేసుకుంటే :హైదరాబాద్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే వారు ఫాస్ట్‌ట్రాక్ ఇమ్మిగ్రేషన్‌లో తమ పేర్లను నెల రోజుల ముందు నమోదు చేసుకుంటే ఈ-గేట్ ద్వారా అనుమతిస్తారు. భారతీయ పాస్ట్‌పోర్టులు ఉన్నవారు, ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డుదారుల కోసం ప్రత్యేకంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఫాస్ట్‌ట్రాక్ ఇమ్మిగ్రేషన్‌తో ఎయిర్‌పోర్టుకు వచ్చిన వెంటనే వీసా తనిఖీ, బోర్డింగ్ పాస్ కోసం ప్రయాణికుల చెక్-ఇన్ కౌంటర్లను సందర్శిస్తే చాలు. మరిన్ని వివరాలకు సంబంధిత వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు పేర్కొన్నారు.