DSC Notification Telangana 2024 : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు డీఎస్సీ అనుబంధ నోటిఫికేషన్ జారీకి కసరత్తు జరుగుతోంది. ఈక్రమంలో విద్యాశాఖలో పదవీ విరమణ చేయనున్న వారితో సహా పలు వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది మెుత్తం 3, 800 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పదవీ విరమణ చేయనున్నారు.
వాస్తవానికి వారందరూ 2021లోనే పదవీ విరమణ చేయాల్సి ఉండగా ప్రభుత్వం రిటైర్‌మెంట్ వయసును మూడేళ్లు పెంచిన నేపథ్యంలో ఇప్పటి వరకు పనిచేస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి పదవీ విరమణలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాల్సి ఉండటంతో పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే ఆయా గణాంకాలను సేకరించింది.
మెగా డీఎస్సీపై కసరత్తు - ఖాళీల లెక్క తేలుస్తున్న అధికారులు
Telangana Govt On DSC Notification 2024 : గత ఏడాది ఆగస్టులో 5,089 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీచేపట్టాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది. పాత నోటిఫికేషన్‌కు మరో 5 వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వనుంది. లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తోంది.
ప్రత్యేక అవసరాల పిల్లల(సీడబ్ల్యూఎస్‌ఎన్)కు బోధించేందుకు దాదాపు 1,500 స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులను కూడా భర్తీ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న వారికి పదోన్నతులు తదితర వాటిపై సర్కారు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సీఎం రేవంత్‌రెడ్డి వద్ద మరోసారి చర్చించి తుది ఆమోదం పొందాల్సి ఉందని తాము అంతా సిద్ధం చేసి ఉంచామని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.