Diwali Celebrations at Thumbs : దీపావళి పండుగ రోజు ఎవరైనా లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఇంట్లో బాణాసంచా కాలుస్తారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా శ్మశానంలో దీపావళి సంబురాలు జరుపుకుంటారు. ఇదేంటి? వెలుగులు విరజిమ్మే దీపావళి రోజు శ్మశానంలో సంబురాలు చేసుకోవడం ఏంటని ఆశ్చర్యంగా చూస్తున్నారా? అసలు ఆ వింత సాంప్రదాయం ఎక్కడ పాటిస్తున్నారు? అలా ఎందుకు చేస్తారో తెలుసుకోవాలని ఉందా. అయితే ఈ స్టోరీ చదివేయండి.
కరీంనగర్‌లోని ఒక సామాజిక వర్గం సమాధుల వద్ద పూజలు చేసి దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ వింత ఆచారం కరీంనగర్‌లోని కర్మాన్‌ఘాట్‌లో దర్శనమిచ్చింది. చనిపోయిన తమ పూర్వీకులను గుర్తు చేసుకుంటూ వారి సమాధుల వద్ద తిను బండారాలను పెట్టి దీపాలు వెలిగిస్తారు. అనంతరం టపాసులు కాల్చి వేడుకలు చేసుకుంటారు. ఇలా ఈ ఆచారాన్ని దశాబ్దాలుగా కొనసాగిస్తున్నట్లు స్థానికులు తెలిపారు.
మెదక్ జిల్లాలో అర్ధ శతాబ్ధంగా సమాధుల వద్ద దీపావళి :ఇదిలా ఉండగా మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్ గ్రామంలోనూ ఇలాంటి వింత ఆచారం అర్ధ శతాబ్దం నుంచి కొనసాగుతోందట. చనిపోయిన వారిని స్మరించుకుంటూ దీపావళి రోజు అంతా సమాధుల వద్దకు వెళతారు. అక్కడ నైవేద్యాలు పెట్టి, మతాబులు కాల్చి సంబురాలు చేసుకుంటారు. ఇక్కడ కొన్ని కుటుంబాలు 50 ఏళ్లుగా ఈ వింత సంస్కృతిని ఆనవాయితీ పాటిస్తున్నాయి. దీపావళి రోజున చనిపోయిన వారికి ఇష్టమైన పిండి వంటకాలను ఇంట్లో చేసి, ఎంతో ఇష్టంతో శ్మశానం వద్దకు తీసుకెళతారు.