తెలంగాణ

telangana

ETV Bharat / state

జీఎస్టీల చెల్లింపులపై భగ్గుమంటున్న రెండు శాఖలు - రూ.54 కోట్ల పన్ను చెల్లించాలని ఎక్సైజ్‌ శాఖ​కు నోటీసులు - notice on gst to excise department - NOTICE ON GST TO EXCISE DEPARTMENT

Excise and Tax Department on 54 Crore GST : రాష్ట్రంలో రెండు ప్రభుత్వ శాఖల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ముదిరి పాకాన పడుతోంది. వ్యాట్‌, జీఎస్టీల చెల్లింపుల విషయంలో ఎక్సైజ్‌ శాఖ ఏగవేతకు పాల్పడుతున్నట్లు అభియోగంతో వాణిజ్య పన్నుల శాఖ సోదాలు చేయడం, షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో రెండు శాఖల మధ్య వివాదం రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా హాలోగ్రామ్‌ల అమ్మకాలపై 54 కోట్లు రూపాయలకుపైగా జీఎస్టీ చెల్లించాలని ఇచ్చిన షోకాజ్‌ నోటీసులు రెండు శాఖల మధ్య అంతరాన్ని మరింత పెంచినట్లయిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Notice on Hologram GST Due
Notice on Hologram GST DueNotice on Hologram GST Due (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 7, 2024, 7:57 PM IST

Excise and Tax Department Issue Notice on Hologram GST Due :రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు ప్రభుత్వ శాఖల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. పన్నుల చెల్లింపుల విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. మద్యం, పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలపై వస్తున్న వ్యాట్‌ ఆశించిన మేరకు రావడం లేదు. ఏడాదికేడాది అటు మద్యం, ఇటు పెట్రోల్‌, డీజిల్‌ వాడకం పెరుగుతూ వస్తోంది. దానికి తగినట్లు వ్యాట్‌ రాబడులు కూడా పెరగాల్సి ఉంది. కాని అది జరగడం లేదని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది.

గతంలో ప్రతి ఏడాది కనీసం పది శాతం, అంతకన్నా ఎక్కువ ఆదాయం పెరుగుతూ వచ్చి 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యల్పంగా పెరగడంతో వాణిజ్య పన్నుల శాఖలో అనుమానాలు రేకెత్తాయి. వ్యాట్‌, జీఎస్టీ రాబడులపై అధికారులతో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి సమీక్ష చేశారు. మద్యం, పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలపై రావల్సిన వ్యాట్‌ ఆశించిన మేర లేదని గుర్తించారు. వాడకం పెరిగినా తగిన విధంగా రాబడి పెరగలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

దీంతో ఎక్సైజ్‌ అకాడమీలో కొనసాగుతున్న హాలోగ్రామ్‌ల తయారీ, పంపిణీ సంస్థపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. అయితే జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటికీ హాలోగ్రామ్‌ అమ్మకంపై పన్ను చెల్లించడం లేదని తేల్చిన వాణిజ్య పన్నుల శాఖ, అబ్కారీ శాఖ కమిషనర్‌కు షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది.

Tax and Excise Department Issues in Telangana :మద్యం బాటిళ్లపై వేసే హాలోగ్రామ్‌లను డిస్టిలరీలు, బ్రీవరీలకు, డీపోలకు చేసిన అమ్మకాలపై జీఎస్టీ చెల్లించాలంటూ ఎక్సైజ్‌ శాఖకు వాణిజ్య పన్నుల శాఖ ఏప్రిల్‌ 25వ తేదీన షోకాజ్‌ నోటీసు ఇచ్చింది. హాలోగ్రామ్‌ల అమ్మకాలపై 18 శాతం లెక్కన జీఎస్టీ చెల్లించాలని ఆ నోటీసులో వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేసింది. 2017-18 నుంచి 2023-24 వరకు అమ్మిన 302.98 కోట్ల రూపాయల విలువైన వెయ్యి కోట్లకుపైగా హాలోగ్రామ్‌లపై 54.53 కోట్ల రూపాయల జీఎస్టీ చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ నోటీసులో వెల్లడించింది.

ఒక్కో హాలోగ్రామ్‌ 30పైసలు లెక్కన అమ్మకాలు చేసినట్లు నోటీసులో వాణిజ్య పన్నుల శాఖ పేర్కొంది. వారం రోజుల లోపల నిర్దేశించిన జీఎస్టీ చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామని వాణిజ్య పన్నుల శాఖ సహాయ కమిషనర్‌ వేణుగోపాల్‌ రెడ్డి స్పష్టం చేశారు. గత కొంత కాలంగా ఎక్సైజ్‌, వాణిజ్య పన్నుల శాఖల మధ్య కొనసాగుతున్న ప్రచ్ఛన్న యుద్దం ఈ షోకాజ్‌ నోటీసులతో మరింత ముదిరింది. రెండు శాఖల మధ్య వ్యాట్, జీఎస్టీ చెల్లింపుల విషయంలో తలెత్తిన వివాదాన్ని సమసి పోయేట్లు చేసేందుకు ఈ రెండు శాఖలను పర్యవేక్షిస్తున్న ముఖ్య కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి పలు మార్లు పంచాయతీ చేసినా ప్రయోజనం లేదని విశ్వసనీయ సమాచారం.

తాజాగా షోకాజ్‌ నోటీసులు ఇవ్వడంతో ఆ రెండు శాఖలకు చెందిన ఉన్నతాధికారుల మధ్య అంతరం మరింత పెరిగింది. వాస్తవానికి నోటీసుల్లో పేర్కొన్నట్లు వాణిజ్య పన్నుల శాఖకు ఎక్సైజ్‌ శాఖ 54.53 కోట్లు జీఎస్టీ చెల్లించినట్లయితే అందులో సగం 27 కోట్లు కేంద్ర జీఎస్టీ కింద కేంద్రానికి పోతుంది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ ఇచ్చిన నోటీసు కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు 27 కోట్లు నష్టం వాటిల్లుతుందని వాణిజ్య పన్ను శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడకుండా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

డిస్టిలరీల నుంచి అనధికారిక మద్యం - రూ.వందల కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి!

రాష్ట్రంలో వ్యాట్‌ చెల్లింపులపై ప్రచ్ఛన్న యుద్ధం - వాణిజ్య, ఎక్సైజ్ శాఖల మధ్య నెలకొన్న వైరం

ABOUT THE AUTHOR

...view details