Indian Railway Help Line Number : రైలు ప్రయాణంలో మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? రైల్వే సమాచారం ఏదైనా తెలుసుకోవాలా? తక్షణమే మీరు రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయాలా? అయితే ఈ అన్ని సమస్యలపై ప్రయాణికులు ఫిర్యాదు చేయడానికి ఒక్కో రకమైన సమస్యకు ఒక్కో నంబర్‌కు ఫోన్ చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు ఆ అవసరం లేకుండా భారతీయ రైల్వే సంస్థ అన్నింటికీ ఒకే హెల్ప్ లైన్ నంబర్ - 139ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా రైల్వే ప్రయాణికులు సులభంగా సమాచారం, సేవలు పొందవచ్చు.
ఇక నుంచి టోల్‌ఫ్రీ నంబర్-139కు డయల్ చేయగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని కంట్రోల్ రూమ్ నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఇలా వచ్చిన సమాచారాన్ని రైలు ప్రయాణంలో ఎక్కడి నుంచి కాల్ వచ్చిందో గుర్తిస్తారు. ఆ తర్వాతి రైల్వే స్టేషన్‌లోని రైల్వే రక్షక దళం (ఆర్పీఎఫ్) కేంద్రానికి చేరవేస్తారు. తక్షణమే అధికారులు స్పందించి ప్రయాణికులకు అవసరమైన సేవలను అందిస్తారు. రైల్వేస్టేషన్‌కు రైలు చేరుకోగానే ఫిర్యాదు అందిన బోగీ వద్దకు ఆర్పీఎఫ్ సిబ్బంది చేరుకొని, సమస్యను పరిష్కరించి చర్యలు తీసుకుంటారు.
ఆర్పీఎఫ్ అందించే సహాయం :
- ప్రమాద సమాచారం
- రైళ్ల సమాచార ఫిర్యాదులు
- ప్రయాణికుల భద్రత, వైద్య సహాయం
- నిఘా సమాచారం
- స్టేషన్‌లో ఫిర్యాదులు
- ప్రయాణికుడికి సంబంధించిన వివరాలు తెలుసుకోవటం
- సరకు రవాణా, పార్సిల్ సమాచారం
- పీఎన్‌ఆర్ పరిస్థితి
- క్యాటరింగ్, సాధారణ విచారణ
- రైళ్ల రాకపోకల వివరాలు
- వీల్‌ఛైర్ బుకింగ్
- టికెట్ రద్దు సమాచారం
- భోజన సదుపాయాలపై ఫిర్యాదు