Deputy CM Bhatti Vikramarka about Inspection in Hostels : నెలలో ఒకరోజు వసతిగృహాలకు వెళ్తామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి పాటు అందరం వెళ్తామని స్పష్టం చేశారు. ఈ నెల 15, 16వ తేదీల్లో అన్ని హాస్టల్స్ సందర్శిస్తామని అక్కడే భోజనం చేస్తామని వివరించారు. మొదటి రోజున సీఎం రేవంత్ రెడ్డి, తనతోపాటు ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్ నాయకులు, అధికారులు అంతా ఉంటారని వివరించారు. ఇవాళ అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
ఈ సమయంలోనే గురుకుల హాస్టళ్లు, పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం సరిగా ఉండటం లేదన్న వార్తలపై ఆయన స్పందించారు. ఇక నుంచి తాము నెలలో ఒకరోజు హాస్టళ్లకు వెళ్లి పరిశీలిస్తామన్నారు. విద్యార్థులతో కలిసి భోజన చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. హాస్టళ్లల్లో వసతులు మెరుగుపరుస్తామని, వసతులు మెరుగుకు రూ. 5 వేల కోట్లు ఖర్చుపెడతామని చెప్పారు. గత పదేళ్లలో డైట్ ఛార్జీలు పెంచలేదని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం రాగానే ఛార్జీలు పెంచిందని గుర్తు చేశారు.