Deputy CM Bhatti Answer to Opposition Questions On Budget :బడ్జెట్‌పై విపక్షాలు లేవనెత్తిన ప్రశ్నలకు ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. వందశాతం వాస్తవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం మాదిరి, గొప్పలకు పోలేదని వివరించారు. అంతకుముందు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి వల్లే హైదరాబాద్‌కు వెల్లువలా పెట్టుబడులు వచ్చాయన్న భట్టి విక్రమార్క, గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమని విమర్శించారు.
మహిళలకు వడ్డీలేనిరుణాల కోసం రూ. 20వేల కోట్లు కేటాయించామన్న ఆయన హైదరాబాద్ ప్రగతికి రూ. 10 వేల కోట్లు పెట్టిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. నూటిని నూరుశాతం గ్యారంటీలను అమలుచేస్తామని తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం గొప్పల కోసం భారీ బడ్జెట్‌లు పెట్టిందని, వాస్తవంలో మాత్రం ఏటా రూ.60 వేల నుంచి రూ.70 వేల కోట్లు ఖర్చు చేయలేదని ఆరోపించారు. గొప్పల కోసం అయితే తాము కూడా రూ.3.50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టేవాళ్లమన్నారు.
"బడ్జెట్లో పొందిపరిచిన ప్రతి పైసా అర్ధవంతంగా ఖర్చు పెట్టాలనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.2.90 లక్షల కోట్లు బడ్జెట్ పెడితే, మేము నిజంగా వారిలా అడ్డగోలుగా, ఊహాజనితంగా ఏదో అలా పెట్టుంటే రూ.3.50 లక్షల కోట్లు అయ్యేది. కానీ మేము పెట్టింది కేవలం రూ.2.91 లక్షల కోట్లు మాత్రమే. అంటే వారు పెట్టిన దానికంటే ఒక వెయ్యి రూపాయలు మాత్రమే పెంచాం."-భట్టి విక్రమార్క, ఉపముఖ్యమంత్రి
గత పదేళ్లలో సాగునీటి సమస్య ఏ మాత్రం తీరలేదు :సాగునీటి సమస్య తీరాలనే పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నామన్న ఉపముఖ్యమంత్రి, రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం నిర్మించినా, ఉపయోగం లేకుండా పోయిందన్నారు. మేడిగడ్డ వద్ద వచ్చిన నీరు వచ్చినట్లే పోతోందని, నిల్వ చేయలేని పరిస్థితి ఉందని దుయ్యబట్టారు. గత పదేళ్లలో సాగునీటి సమస్య ఏ మాత్రం తీరలేదని ఆక్షేపించారు.
రూ.లక్ష కోట్లు ఖర్చు చేసినా, కొత్తగా లక్ష ఎకరాలకు కూడా సాగునీరు అందలేదన్నారు. ప్రాధాన్యత వారీగా సాగునీటి ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తుందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యి నీరు వచ్చే ప్రాజెక్టులను ముందుగా పూర్తి చేస్తామని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పదేళ్ల పాటు పట్టించుకోలేదన్న భట్టి, ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ను పూర్తి చేసి ఉంటే, నల్గొండ జిల్లాకు సాగునీరు అంది ఉండేదని వ్యాఖ్యానించారు.