ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైఎస్సార్సీపీ 'సముద్రపు దొంగలు' - కాకినాడ పోర్టులో చినబాబురెడ్డి 'డి గ్యాంగ్‌' దందాలు

వైఎస్సార్సీపీ జమానాలో డి-గ్యాంగ్‌ అడ్డగోలు దందాలు

D Gang Irregularities at Kakinada Port
D Gang Irregularities at Kakinada Port (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 3, 2024, 10:13 AM IST

Kakinada Port Issue : ఎక్కడైనా పోర్టు నుంచి సరుకు ఎగుమతి చేసుకోవాలంటే ప్రభుత్వానికి సుకం కడితే సరిపోతుంది. కానీ కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి చేసుకోవడానికి అక్కడ డి-గ్యాంగ్‌కు కప్పం కట్టాలి. వాళ‌్లు అడిగినంత ముట్టజెప్తేనే సరుకు తీరం దాటుతుంది. వైఎస్సార్సీపీ జమానాలో డి ఫర్ దోపిడీ అన్నట్లు సాగిన దందా మొత్తం ఓ నాయకుడి కుటుంబం, ఆ నేత అనుచరుల చుట్టే తిరుగుతోంది. జగన్‌ పాలనలో నాగపూర్‌కు చెందిన వ్యాపారి నుంచి డి-గ్యాంగ్‌ 1.68 కోట్లు వసూలు చేసిన వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది.

వైఎస్సార్సీపీ హయాంలో కాకినాడ పోర్టులో డి-గ్యాంగ్‌ రేషన్‌ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. బియ్యం మాఫియాపై రాష్ట్రంలో విస్తృత చర్చ జరుగుతున్నవేళ గతేడాది జరిగిన ఘటన తాజాగా తెరమీదికి వచ్చింది. కాకినాడ పోర్టు ద్వారా పశ్చిమ ఆఫ్రికా దేశానికి బియ్యం ఎగుమతి చేయడానికి నాగపూర్‌ జిల్లాలోని లఖడ్‌గంజ్‌కి చెందిన శ్రీరామ్ ఫుడ్ ఇండస్ట్రీస్ యజమాని అనూప్ గోయల్ అప్పట్లో అవస్థలు పడ్డారు. పోర్టు నుంచి బియ్యం ఎగుమతులకు కొందరు అడ్డుతగిలారు. ముడుపులిస్తేనే సరుకు కదులుతుందని బెదిరించారు.

ఈ వ్యవహారానికి సంబంధించి నాగపూర్ పోలీసులు కాకినాడకు చెందిన కీలక ఎగుమతిదారులు చినబాబురెడ్డి, విపిన్ అగర్వాల్, లక్ష్మి వెంకటేశ్వర హైజిన్ ఫుడ్ డైరెక్టర్ బీవీ కృష్ణారావుపై గతేడాదే కేసు నమోదు చేశారు. ఆర్థిక నేరాల విభాగం వారికి నోటీసులూ జారీచేసింది. నాగపూర్ వ్యాపారి అనూప్ గోయల్ 30,000 టన్నుల బియ్యాన్ని కొనుగోలు చేసి సెనెగల్​కు ఎగుమతి చేయాలని నిర్ణయించారు. కాకినాడలోని ఓ గోదాములో నిల్వలు ఉంచారు. అయితే ఈ బియ్యం ఎగుమతికి ఎగుమతిదారుల సంఘం నిరాకరించింది.

Ration Rice Smuggling in AP :సంఘం మాటున కొందరు సెటిల్మెంట్లకు దిగారు. బియ్యం ఎగుమతి చెయ్యాలంటే రూ.2.40 కోట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. అనేక చర్చల తర్వాత అనూప్ గోయల్ రూ.1.68 కోట్ల ముడుపులు ఇవ్వడానికి అంగీకరించారు. అయితే ఆ సొమ్మును సంఘం ఖాతాకు కాకుండా లక్ష్మీ వెంకటేశ్వర హైజనిక్ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ ఖాతాకు బదిలీ చేయాలని సూచించారు. ఆమేరకు చెల్లించిన నాగపూర్ వ్యాపారి బియ్యం నిల్వలు సెనెగల్‌కు చేరాక డి-గ్యాంగ్‌ దందాపై నాగ్‌పూర్‌లోని లఖడ్​గంజ్ పోలీసులకు 2023 ఏప్రిల్ లో ఫిర్యాదు చేశారు. కాకపోతే అప్పుడు అధికార పరపతిని అడ్డుపెట్టుకుని మొత్తం వ్యవహారాన్ని తొక్కిపట్టారు.

వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి సోదరుడు వీరభద్రారెడ్డికి ఎగుమతులు, రైస్ మిల్లులు, రొయ్యల శుద్ధి పరిశ్రమలున్నాయి. నాగపూర్ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడంలో కీలకంగా వ్యవహరించిన చినబాబురెడ్డి ఈయనే అనే ప్రచారం సాగుతోంది. వీరభ్రద్రారెడ్డిని స్థానికంగా అంతా చినబాబు అని పిలుస్తుంటారు. ద్వారంపూడి బంధువుల్లో చినబాబు అనే మరో వ్యక్తి కూడా ఉన్నారు. ద్వారంపూడి అధికారంలో ఉన్నప్పుడు చినబాబు చక్రం తిప్పేవారు. ఆనాడు బెదిరించి వసూళ్లకు తెగించింది, ఎవరనేది స్పష్టత రావల్సి ఉంది. ఇలా కాకినాడ పోర్టు ప్రతిష్ఠ ముంబయి స్థాయిలో దిగజారినా స్థానిక పోలీసులు, యంత్రాంగానికి చీమకుట్టినట్లయినా లేకపోయింది.

ప్రభుత్వ వ్యవస్థలు పతనం! - కాకినాడ పోర్టు కేంద్రంగా భారీగా తరలుతున్న సరుకు

బియ్యం అక్రమ ఎగుమతి వెనక పెద్దవాళ్లు - ఓడలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు: పవన్ కల్యాణ్​

ABOUT THE AUTHOR

...view details