OCD Symptoms and Treatment : కొంతమంది కడిగిందే కడుగుతుంటారు, తుడిచిందే మళ్లీమళ్లీ తుడుస్తుంటారు. అలాగే తాళం వేశామా, లేదా? స్టవ్ ఆఫ్ చేశామా, లేదా? తలుపుకు గొల్లెం పెట్టామా, లేదా? వంటి అనుమానాలతో నిత్యం సతమతమవుతుంటారు. ఎదుటివాళ్లు 'ఏంటీ చాదస్తం' అంటున్నా మానుకోలేరు. దీని గురించి పెద్దగా పట్టించుకోరు. కానీ, ఇది ఒక మానసిక రుగ్మత అని చాలా మందికి తెలియదు. ఈ లక్షణాలు కొంతవరకు ఉంటే పర్వాలేదు. కానీ కొంతమందిలో ఇది శ్రుతి మించిపోతుంది. విపరీతమైన ఆలోచనలు పదే పదే మదిలో మెదులుతుంటాయి. తన ప్రమేయం లేకుండానే మనసులోకి వెళ్లి గందరగోళంలో పడేస్తుంటాయి. ఇలాంటి మానసిక రుగ్మతనే 'అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ)' అంటారు. అయితే, ఓసీడీ లక్షణాలు ఎలా ఉంటాయి ? దీనికి చికిత్స ఉందా ? అనే ప్రశ్నలకు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ మండాది గౌరీదేవి సమాధానం చెబుతున్నారు. ఆ వివరాలు మీ కోసం.
మనలో దాదాపు రెండు శాతం మంది ఓసీడీతో బాధపడుతుంటారు. ఈ మానసిక రుగ్మత ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరికైనా, ఏ వయసులో వారికైనా వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా 30 ఏళ్లు దాటిన వారిలో కనిపిస్తుంది. అయితే, కొంతమంది ఓసీడీ వల్ల అతి శుభ్రంగా ఉండడం మంచిదేనని భావిస్తుంటారు. కానీ, ఇది కేవలం అపోహ మాత్రమేనని, తీవ్రంగా ఉన్నవారు చికిత్స చేయించుకోవాలని గౌరీదేవి సూచిస్తున్నారు.
ఓసీడీ లక్షణాలు :
- 30 ఏళ్లున్న వ్యక్తికి తోటి స్నేహితుడి తలను బండరాయితో పగలగొట్టాలనే ఆలోచనలు వస్తాయి. ఎప్పుడైనా భవనం పైనుంచి కిందకు దూకేయాలనుకుంటాడు. పదేపదే ఈ ఆలోచనలు అతడిని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంటాయి.
- 45 ఏళ్లున్న మహిళకు తన భర్త నిద్రించేటప్పుడు ముఖంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేస్తానేమోననే ఆలోచనలు తరచూ వస్తుంటాయి. తన బిడ్డ గొంతు నులిమి చంపేస్తానేమోనని భయమేస్తుంది. ఇలాంటివారు పుస్తకం, న్యూస్పేపర్ కాగితాలను ఉండలాగా నలిపి కింద పడేస్తుంటారు.
- 40 ఏళ్లున్న మహిళ వంట చేస్తుండగా ఏదో పురుగు పడిందనో, బల్లి పడిందనో ఆందోళన చెంది మళ్లీ వంట చేస్తుంటుంది.
- ఇంకో మహిళ పని మనిషి గిన్నెలు కడిగినా మళ్లీ మళ్లీ అపరిశుభ్రంగా ఉన్నాయని కడుగుతుంది.
- ఏదైనా వస్తువులు తాకినా చేతులు కడుక్కోవడం, బయటకు వెళ్లి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోవడం వంటివి కూడా ఓసీడీ లక్షణాలే.
- కొందరు అమ్మానాన్నలు లేదా ఇష్టమైన వారు ప్రమాదంలో చనిపోయినట్లు, వారికి పాడె కడుతున్నట్లు, ఏడుస్తున్నట్లు భావిస్తుంటారు.
- విద్యార్థులు పరీక్షల్లో రాసిన ఆన్సర్ కొట్టేసి, మళ్లీ మళ్లీ రాస్తూ సమయం వృథా చేసుకుంటారు.
ఓసీడీకి సంబంధించిన కొన్ని సందేహాలు - సమాధానాలు
అందరికీ కొంత ఓసీడీ ఉంటుందా?
అందరిలో విపరీత ఆలోచనలు, చేసిన పనుల్ని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవడం వంటి లక్షణాలు కొంతవరకు ఉంటాయి. కానీ అతి ఎక్కువగా ఉండకూడదు. ఇలాంటి లక్షణాలు అధికంగా ఉన్నవారు చికిత్స తీసుకోవాలి.
ఓసీడీ బాధితులు చాలా శుభ్రత పాటిస్తారా?
కొంతమంది మాత్రమే శుభ్రత రుగ్మతతో బాధపడుతుంటారు. మిగిలినవారు కేవలం తమ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుని పరిసరాలను అపరిశుభ్రంగా వదిలేస్తారు.
ఓసీడీ ఉన్నవారు పద్ధతిగా నడుచుకుంటారా?
కొంతమంది మాత్రమే పద్ధతిగా ప్రవర్తిస్తారు. మిగిలినవారు ఇష్టారీతిగా వ్యవహరిస్తుంటారని డాక్టర్ గౌరీదేవి తెలిపారు.
ఓసీడీ ఉండడం మంచిదేనా?
ఈ మానసిక రుగ్మత వల్ల శుభ్రంగా, క్రమపద్ధతిలో ఉంటామనే భావన సరికాదు. ఈ ప్రాబ్లమ్ మితిమీరి పోయినప్పుడు కొన్నిసార్లు నష్టాలు కూడా జరుగుతాయి. టైమ్ వృథా అవుతుంది. బాధితులు ఇతర పనులపై ఏకాగ్రత కోల్పోతారు. కోపం, అసహనం పెరిగి ఎదుటివారితో గొడవలు పడుతుంటారు.
ఓసీడీ వ్యక్తిత్వం మంచి గుణమేనా?
ఓసీడీ వ్యక్తిత్వాన్ని సూచించే మంచి గుణం కానే కాదు. కచ్చితంగా ఒక మానసిక రుగ్మతే. పరిశుభ్రంగా ఉండడం, వస్తువులను జాగ్రత్త చూసుకోవడం మంచి అలవాట్లే. కానీ, అవి శ్రుతి మించినప్పుడే సమస్య మొదలవుతుంది. ఎక్కువమంది దీన్ని రుగ్మతగా గుర్తించరు. అలా గుర్తించడానికి కూడా ఇష్టపడరు.
ఒత్తిడి వల్ల ఓసీడీ వస్తుందా?
ఒత్తిడి వల్ల మానసిక రుగ్మత రాదు. కానీ దాంతో రుగ్మత బయటపడే అవకాశాలున్నాయి. ఇది మెంటల్ ప్రాబ్లమ్. కుటుంబపరంగా, జన్యుపరంగా కూడా సంక్రమిస్తుంది. మెదడులో న్యూరోట్రాన్స్‌మీటర్ల లోపాలే దీనికి ప్రధాన కారణమని డాక్టర్ గౌరీదేవి తెలిపారు.
ఓసీడీకి చికిత్స ఉందా?
ప్రస్తుతం మంచి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మెడిసిన్, సైకోథెరపీ, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీల ద్వారా దాదాపు 60 నుంచి 70 శాతం మందిలో లక్షణాలు అదుపులో ఉంటాయి. ట్రీట్మెంట్ దీర్ఘకాలం ఉంటుంది. ఆపై తగ్గుముఖం పడుతుంది. 30 శాతం మందిలో మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిని బట్టి ట్రీట్మెంట్లో తేడాలుంటాయి. వయసు, కుటుంబ నేపథ్యం, జీవితానుభవాలు కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయి. ఆలోచన దృక్పథాన్ని వాస్తవిక కోణంలో చూపించడం ద్వారా వారిలో మార్పు తీసుకురావచ్చని మానసిక వైద్య నిపుణులు డాక్టర్ గౌరీదేవి చెప్పారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
పిల్లాడి వృషణాలు చిన్నగా ఉన్నాయా? - మలబద్ధకం సమస్యా?
ఆయుష్షును పెంచే అలవాట్లు ఇవేనట! - ICMR విడుదల చేసిన చిట్కాలు