Vijayawada Thermal Power Station Pollution Effect On Villages : ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ నుంచి వెలువడే వాయుకాలుష్యంతో ఆరోగ్యం పాడవుతుందని ఎప్పటి నుంచో స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా తాగే జలాలు సైతం కలుషితం అయ్యాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటీపీఎస్ (Vijayawada Thermal Power Station) యాష్ పాండ్ నుంచి వెలువడుతున్న బూడిదనీరు కొండపల్లి రక్షితనీటి పథకం ఫిల్డర్ బెడ్ల ద్వారా తాగునీటిలో కలుస్తుందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో సమస్య వెలుగులోకి వచ్చింది.
కొండపల్లిలోని మెగా రక్షితనీటి పథకం ద్వారా ఇబ్రహీంపట్నం, కొండపల్లి మున్సిపాల్టీలతో పాటు మైలవరం, రెడ్డిగూడెం, జి.కొండూరు, విజయవాడ గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందుతోంది. ఈ రక్షిత నీటిపథకానికి వీటీపీఎస్ కూలింగ్ కెనాల్‌కు వెళ్లే కాలువే ప్రధాన ఆధారం. గత నాలుగు రోజులుగా రక్షిత నీటిపథకం నుంచి తాగునీరు ప్రజలకు అందడం లేదు. ఇదేమని ప్రజలు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. కాలువలోకి ధర్మల్ పవర్ స్టేషన్ నుంచి వేడి బూడిదనీరు కలిసిపోతోందని గుర్తించారు.
ఈ బూడిద నీటిపథకం ఫిల్టర్ బెడ్లలోకి చేరడంతో స్కీమ్ పని చేయడాన్ని సిబ్బంది ఆపేశారు. పైపులు లీకేజీ అవడంతో బూడిద నీరు ప్రత్యేకించి ఏర్పాటు చేసిన చెరువులోకి వెళ్లకుండా కాలువలో కలిసిపోతుందని గుర్తించారు. ఈ ఔట్ లెట్ పవర్ స్టేషన్ లోపల ఉండటంతో బయట ప్రజలు గమనించే అవకాశం లేదు. ఈ కాలువ నీటినే రక్షితనీటి పథకానికి మళ్లిస్తుండటంతో తాగేనీరు కలుషితం అవుతుందని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం ఉండటంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
'కొండపల్లి ప్రాంతంలో మాకు జీవించే హక్కు లేదా అన్నట్లు ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. బిందెల్లో అడుగున మొత్తం సిమెంట్ పేరుకుపోయి ఉంది. పిల్లలు, ఆడవాళ్లు వీటితో ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారు. పీల్చేగాలి, తాగే నీరు అంన్నింటిలో బూడిదే వస్తుంది.' - బాధితులు
ఫ్లైయాష్ వివాదం - ముగ్గురు అధికారులపై బదిలీ వేటు
తాగునీరు కలుషితమవుతుందన్న సమాచారంతో వివిధ పార్టీల నాయకులు తాగునీటి పథకానికి నీరందించే కాలువను పరిశీలించారు. ఇది ముమ్మాటికి అధికారుల నిర్లక్ష్యానికి దర్పణం పడుతుందని ఆరోపించారు. గతంలో వాయుకాలుష్యంతో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు తాగునీటి కాలుష్యంతో తమ పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.
లా అండ్ ఆర్డర్ సమస్య వస్తే ఎవ్వరినీ ఉపేక్షించను - 'బూడిద' గొడవపై చంద్రబాబు అసహనం