Visakhapatnam High Court Bench Issue : విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ కోసం ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సును నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ జిల్లాలకు చెందిన న్యాయవాదులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అన్ని సౌకర్యాలున్న విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానించారు.
విశాఖపట్నంలో ప్రిన్సిపల్ హైకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని తీర్మానించారు. అదేవిధంగా న్యాయవాదుల సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. హైకోర్టు బెంచ్ కోసం చేపడుతున్న కార్యాచరణలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తామని విశాఖ బారో అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు. 1993 నుంచి ఇందుకోసం ఉద్యమాలు జరుగుతున్నట్లు గుర్తుచేశారు. ఇకపై దీనిపై పట్టు వీడేది లేదన్నారు. దీనికోసం స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేసి తమ డిమాండ్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని సత్యనారాయణ వెల్లడించారు.
"రాష్ట్రంలో అన్ని సౌకర్యాలున్న విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. ఇక్కడి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. హైకోర్టు బెంచ్ కోసం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతాం.ఈ కార్యాచరణలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తాం. విశాఖపట్నంలో ప్రిన్సిపల్ హైకోర్టు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం." - సత్యనారాయణ, విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు
కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మరో ముందడుగు - భవనాల కోసం అన్వేషణ