Three Feet Banana Tree For Decoration in Eluru District : ఆ చెట్లు ఎత్తు కేవలం మూడు అడుగులు మాత్రమే. అయితేనేం గెలులు పుష్కలంగా వేస్తాం అంటున్నాయి ఏలూరు జిల్లాలోని ఓ తోటలేని చెట్లు. అబ్బో అలా అని వాటిని తినలేరు. అవును మీరు వింటున్నదే నిజమే. ఆ చెట్లు కేవలం చూసుకోవడానికి మాత్రమే, తినడానికి కాదు. ఇంతటి విచిత్రమైన ఆ అరటి చెట్లు విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా అరటి చెట్లు 10 అడుగులకు పైనే పొడవు ఉంటాయి. అరటి ఆకులు, గెలలు శుభ సందర్భాల్లో అలంకారాలుగా ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద ఆకులు, గెలలతో పచ్చదనంతో అరటితోట ఎంతో ఆహ్లాదాన్ని పంచుతుంది. కానీ ఏలూరు జిల్లాలోని ఓ అరటి తోట అందుకు పూర్తి భిన్నంగా ఉంది. దాన్ని చూస్తే ఏంటిది ఇలా ఉంది, అసలు ఇది అరటి చెట్టేనా అని షాక్ అవ్వడం పక్కా.
ఆ అరటి తోటలోని చెట్లు మూడు అడుగుల ఎత్తు కూడా లేవు. కానీ ఆ చెట్లు పుష్కలంగా పూత, కాయ వేస్తున్నాయి. అలాగని సంబరపడొద్దు. ఎందుకంటే ఇది తినే అరటి రకం కాదు. ఏలూరు జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన విశ్వవిద్యాలయంలోని పరిశోధన స్థానంలో రెండు సంవత్సరాలుగా వీటిని సాగు చేస్తున్నారు. ఈ అరటి చెట్టు శాస్త్రీయనామం మూస ఆర్నాట. ఇది తక్కువ ఎత్తు నుంచే చిన్న చిన్న గెలలు వేస్తాయి. వీటిని ఎక్కువగా గృహాలంకరణ కోసం పెంచుతుంటారని పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రమేశ్‌బాబు చెప్పారు.
మరి ఇంత బుజ్జిబుజ్జిగా ఉండే చెట్లను మీ ఇంట్లో కూడా పెంచుకోవాలి అని ఉందా? మరెందుకు ఆలస్యం మీ దగ్గర్లోని నర్సరీకి వెళ్లి ఇటువంటి అరటి చెట్లు ఉన్నాయో లేవో తెలుసుకోండి. ఉంటో మీ ఇంటి దగ్గర సైతం ఓ రెండు అలా పెట్టుకోండి. మీ ఇంటికి వచ్చిన వారిని ఆశ్చర్యపరచండి. అంతే కాకుండా మీ ఇంట్లో పిల్లలు ఉంటే వీటిని చూసి ఎంతగా మురిసిపోతారో ఓసారి చూడండి.