YELLOW CUCUMBER RED CHILLI CHUTNEY : దోసకాయ పచ్చిమిర్చి పచ్చడి రుచే వేరు. పచ్చి పచ్చిగా కారంగా ఎంతో బాగుంటుంది. దాదాపు అదే స్టైల్లో కారంగా, పుల్లగా అక్కడక్కడా పంటికింద కరకరలాడే దోసకాయ ఉల్లిపాయ ముక్కలతో ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది పల్నాడు దోసకాయ ఎండుమిర్చి పచ్చడి.
వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లులి, పల్లీలతో పాటు చింతపండు వేసి మెత్తని పేస్ట్ చేసి అందులో దోసకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి. చివరగా తాలింపు వేసుకుని వేడి అన్నంతో తింటే అద్భుతంగా ఉంటుంది. ముందుగా దోసకాయలను చేదు చూసుకోవాలి. మెత్తటివి కాకుండా కాస్త గట్టిగా, కరకరలాడే దోసకాయలు ఎంచుకుంటే మంచిది. పై చెక్కు, గింజలు తీసేసి చిన్న ముక్కలు చేసుకుంటే చాలు.
10నిమిషాల్లో చిక్కటి గడ్డ పెరుగు - రసాయనాలు లేకుండానే చిన్న చిట్కాతో ఇలా తయారు చేసుకోండి
కావాల్సిన పదార్థాలు
- దోసకాయలు - 750 గ్రాములు
- ఎండు మిర్చి - 12
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- వేరుశెనగ గుండ్లు - 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- వెల్లులి రెబ్బలు - 12
- చింతపండు - నిమ్మకాయంత
- ఉల్లిపాయ - 1
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - చిటికెడు
తాలింపు కోసం:
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - 1 టేబుల్ స్పూన్
- సెనగపప్పు - 1 టేబుల్ స్పూన్
- మినపప్పు - 1 టేబుల్ స్పూన్
- కరివేపాకు - ఒక రెబ్బ
- జీలకర్ర - 1 టేబుల్ స్పూన్
- ఎండుమిర్చి - 2
- కొత్తిమీర - కొద్దిగా
తయారీ విధానం
- ముందుగా దోసకాయ చెక్కు, గింజలు తీసేసి చిన్న చిన్న ముక్కలు తరిగి పెట్టుకోవాలి.
- నూనె వేడి చేసి అందులో పల్లీలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసి రంగు మారే దాకా వేపుకోవాలి.
- వేగిన మిర్చి, పల్లీలను మిక్సర్ జార్లోకి తీసుకుని అందులోనే నానబెట్టిన చింతపండు, పసుపు, ఉప్పు వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి.
- పిడికెడు దోసకాయ ముక్కలు మినహా మిగిలిన ముక్కలు, ఒక ఉల్లిపాయ పేస్ట్ లో వేసి రెండు మూడు సార్లు పల్స్ చేస్తూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- రుబ్బుకున్న పచ్చడిలో పిడికెడు దోసకాయ ముక్కలు వేసి కలుపుకోండి.
- నూనె వేడి చేసి అందులో తాలింపు సామగ్రినంతా ఎర్రగా వేపుకుని పచ్చడిలో కలుపుకోవాలి. చివరగా పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుని దింపుకోవడమే. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకుని పచ్చడితో తింటుంటే ఎంతో రుచిగా ఉంటుంది.
రేషన్ బియ్యంతో మెత్తని దూదిలాంటి ఇడ్లీలు - రవ్వ కొనాల్సిన అవసరమే లేదు!
"నెల్లూరు రసం" చిటికెలో ఇలా చేసేయండి! - అన్నం వదిలేసి రసం తాగేస్తారంతే!