Drunk Man Stunts On Kanigiri : మద్యం మనిషితో ఎంతటి పనైనా చేయిస్తుంది. మత్తులో విచక్షణ కోల్పోయి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తారు. ఆ కిక్కులో ఏం చేస్తున్నారో కూడా తెలియదు. ఇలా మోతాదుకు మించి మద్యం తాగి, ప్రాణాల మీదకు తెచ్చుకునే వారు ఉన్నారు. మందుబాబుల చేష్టలు చూసే వాళ్లకు కొన్నిసార్లు కామెడీగా అనిపించినా, మరికొన్ని సార్లు భయాందోళనలకు గురిచేస్తాయి. తాజాగా ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
కనిగిరిలో మద్యం మత్తులో ఓ వ్యక్తి కత్తితో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై అడ్డంగా నిలబడి ఎవరైనా అడ్డొస్తే పొడిచేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. వింతవింతగా ప్రవరిస్తూ అక్కడివారిని హడలెత్తించాడు. నేనే పుష్పాను అంటూ హల్చల్ చేశాడు. దీంతో అటుగా వెళ్తున్న పాదచారులు, వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిపై వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మందుబాబును స్టేషన్కు తరలించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఇటీవలే పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ మందుబాబు హల్చల్ చేశాడు. ఫుల్లుగా మద్యం తాగి గ్రామంలోని ప్రధాని కూడలి వద్ద ఉన్న విద్యుత్ తీగలపై ఎక్కి సేద తీరాడు. పాలకొండ మండలం ఎం.సింగపురం గ్రామానికి చెందిన ఎజ్జల వెంకన్న వ్యవసాయ కూలీ. ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ జరగడంతో విద్యుత్ స్తంభం ఎక్కాడు. ఇది గమనించిన స్థానికులు కరెంట్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకుని హంగామా సృష్టించాడు. రకరకాల విన్యాసాలు చేస్తూ అక్కడి వారిని ఆందోళనకు గురి చేశాడు. కొద్దిసేపటి తర్వాత అతడిని బలవంతంగా కిందకు దించారు.