Bun Dosa Recipe in Telugu : ఉదయం అల్పాహారం చేయకుండా రోజువారీ దినచర్య ప్రారంభం కాదు. కొంత మంది బెడ్ దిగడమే ఆలస్యం కిచెన్ లోకి తొంగి చూస్తుంటారు. ఏం టిఫిన్లు రెడీ చేస్తున్నారో తెలుసుకునేందుకు ఉత్సాహ పడుతుంటారు. సాయంత్రం స్నాక్స్ విషయంలోనూ గృహిణులు చెమటోడ్చక తప్పడం లేదు. తయారీ కోసం ఒక రోజు ముందుగానే సిద్ధం చేసుకోవాల్సి వస్తుంది. చట్నీలు అప్పటికప్పుడు రెడీ చేసుకున్నా ఇడ్లీ, దోసెల కోసం రవ్వ, బియ్యం ముందు రోజునే నానబెట్టాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు తయారు చేసుకునే ఆహార పదార్థాలపై ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. నానబెట్టి సిద్ధం చేసిన ఇడ్లీ, దోసె పిండి మార్కెట్లోనూ దొరుకుతోంది. అయితే బయటి ఫుడ్ క్వాలిటీ, పరిశుభ్రత విషయంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి. అందుకే అప్పటికప్పుడు సిద్ధం చేసుకునే అల్పాహార వెరైటీలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. వాటిలో ఇప్పుడు మనం చెప్పుకొనే బన్ దోసె చాలా మందికి నచ్చిన ఐటమ్. బన్ దోసె ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
మాంసాహారం మంచిదా? చెడ్డదా? - వారంలో ఎన్నిసార్లు నాన్ వెజ్ తినొచ్చో తెలుసా?
కావాల్సిన పదార్థాలివే :
- బొంబాయి రవ్వ - 1 కప్పు
- బియ్యం పిండి - 1 టేబుల్ స్పూన్
- పెరుగు - 3/4 కప్పు (ముప్పావు కప్పు)
- నీళ్లు - 1/2 కప్పు
- నూనె - 3 టీస్పూన్లు
- శనగపప్పు - 1 టీస్పూన్
- ఆవాలు - 1 టీస్పూన్
- జీలకర్ర - 1 టీస్పూన్
- తరుగు కోసం ఉల్లిపాయ - 1
- తరిగిన పచ్చిమిరపకాయలు - 2
- కరివేపాకులు రెబ్బలు - 2
- ఇంగువ - 1/4 టీస్పూన్
- ఉప్పు - 1 టీస్పూన్
- తరిగిన కొత్తిమీర
- వంట సోడా (ఆప్షనల్)
- నూనె - 2 టీస్పూన్లు
మీరు తెస్తున్న చికెన్ మంచిదేనా? - తాజా, కల్తీ మాంసం ఎలా గుర్తించాలంటే!
తయారీ విధానం :
- ముందుగా పిండిని సిద్ధం చేసుకోవాలి.
- ఉప్మా రవ్వ ఒక కప్పు తీసుకుని ముప్పావు కప్పు పులిసిన పెరుగును యాడ్ చేసుకోవాలి. పులిసిన పెరుగు అయితేనే రుచి అధికంగా ఉంటుంది. అర కప్పు నీళ్లు పోసుకుని మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. అప్పుడే రవ్వ పెరుగు, నీళ్లను పీల్చుకుంటుంది. ఆ తర్వాత నీళ్లు కలుపుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి.
- ఈ మిశ్రమంలోకి తాళింపును ముందుగానే సిద్ధం చేసుకోవాలి.
- పాన్ లోకి మూడు టీ స్పూన్ల నూనె పోసుకుని ఒక టీ స్పూన్ శనగపప్పు, ఒక టీస్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జిలకర వేసుకుని ఇవి బాగా వేగాక (ఆవాలు చిటపటలాడాక) సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకులు బాగా మిక్స్ చేసుకుని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
- పావు టీ స్పూన్ ఇంగువ, ఒక టీస్పూన్ ఉప్పు, కొత్తిమీర వేసుకుని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పిండిలో కలుపుకోవాలి.
- పిండి బాగా కలిశాక టేస్ట్ చూసుకుని ఉప్పు కావాలనుకుంటే మళ్లీ వేసుకోవచ్చు.
- మిశ్రమంలోకి బేకింగ్ సోడా కలుపుకోవడం వల్ల దోసె ప్లఫ్ఫీగా వచ్చేందుకు ఛాన్స్ ఉంది. ఇది అవసరం లేదనుకుంటే స్కిప్ చేయవచ్చు. అంతా సిద్ధం చేసుకున్నాక ఇక బన్ దోసె వేసుకోవడమే.
- చిన్న సైజు కడాయి (తాళింపు పెట్టుకునేది) పొయ్యిపై పెట్టుకుని రెండు చెంచాల నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక నెమ్మదిగా దోసె పిండి వేసుకుని మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుని దోసె ఓ వైపు బాగా వేగిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకుని కాల్పుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టడం వల్ల పై పొర తొందరగా కాలి లోపల పచ్చిగా ఉంటుందని గుర్తుంచుకోండి.
- నోరూరించే బన్ దోసెను నచ్చిన చట్నీతో వేడి వేడిగా లాగించొచ్చు.
'తగ్గేదేలే'! - ఆ విషయంలో తెలంగాణను మించిపోయిన ఏపీ - దేశంలో నాలుగో స్థానం