Union Minister Srinivasa Varma on Visakha Steel Plant: తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చి ఊపిరి పోస్తుంటే, ప్రైవేటీకరణ సందేహాలు ఎందుకని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఎన్డీయే ప్రభుత్వం రూ.13,090 కోట్లు ఇచ్చిందని, భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్టీల్ ప్లాంట్‌ను విలీనం చేసుకునేందుకుసెయిల్ సిద్ధంగా ఉందన్న ప్రచారం అవాస్తవమన్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీని ఎలా విలీనం చేసుకుంటామంటూ సెయిల్ అభ్యంతరం తెలిపినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ప్యాకేజీ ఇచ్చి స్టీల్ ప్లాంట్‌ను నష్టాల నుంచి గట్టెక్కించాలని, ఆ తర్వాతే విలీనం గురించి ఆలోచిస్తామని సెయిల్ చెప్పినట్లు శ్రీనివాస వర్మ తెలిపారు.
తాజాగా ప్రకటించిన రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీలో రూ.10,300 కోట్లు క్యాపిటల్ షేర్స్ కింద, రూ.1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్‌గా కేటాయించామన్నారు. ప్రైవేటీకరణ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్‌ను మినహాయించి, ఆంధ్రుల సెంటిమెంట్ కాపాడేందుకు కేంద్రం ఈ ప్యాకేజీ ప్రకటించిందని కేంద్రమంత్రి తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ. 11,440 కోట్లు - కేంద్రం అధికారిక ప్రకటన
కొంతమంది దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారు: ఏపీ చరిత్రలో పరిశ్రమను కాపాడేందుకు ఇచ్చిన అతిపెద్ద ప్యాకేజ్ ఇది అని వెల్లడించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించే అవకాశం కలిగినందుకు ఆంధ్రుడిగా గర్విస్తున్నానని కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ తెలిపారు. దేశంలో స్టీల్ ఉత్పత్తి పెంచాలనేదే ప్రధాని మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ ప్రకటించిన తరువాత కూడా వెనక్కు తగ్గి, భారీగా ప్యాకేజీ ప్రకటిస్తే ఇంకా కొంతమంది దుర్మార్గపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు మరో భారీ ప్యాకేజీ సైతం ఇస్తామని కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి ప్రకటించారని గుర్తు చేశారు.
సొంత గనులు లేకపోయినా లాభాల్లో: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని, సెయిల్‌లో స్టీల్ ప్లాంట్ విలీనం చేయడం జరగదని శ్రీనివాసవర్మ తేల్చిచెప్పారు. నష్టాల నుంచి బయటకు తీసుకొచ్చాక తమకు అప్పగించమని సెయిల్ చెప్పిందని గుర్తు చేశారు. ఈ నెలాఖరులోగా ముడిసరకు తీసుకొచ్చి, ఉత్పత్తి ప్రారంభిస్తామని, ఆగస్ట్ నెలాఖరుకి పూర్తి సామర్థ్యం పెంచి స్టీల్ ప్లాంట్‌ను నష్టాల బాటలోంచి లాభాల్లోకి తీసుకొస్తామని ధీమా వ్యక్తం చేశారు. సొంత గనులు లేకపోయినా వైజాగ్ స్టీల్ లాభాల్లో నడిచిన రోజులు ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలోని జిందాల్, జేఎస్‌డబ్ల్యూ వంటి ప్లాంట్‌లకూ సొంత గనులు లేవని, అయినా కూడా అవి లాభాల్లో ఉన్నాయన్నారు. సొంత గనులు ఉంటే నష్టాలు రావనేది వాస్తవం కాదని శ్రీనివాసవర్మ అన్నారు.
'ఇక విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మాటే ఉండదు' - ఆర్థిక సాయంపై కూటమి నేతల హర్షం