Lokesh Davos Tour Updates : రాష్ట్రంలో టైర్ల తయారీ యూనిట్ ఏర్పాటు, గ్రీన్ హైడ్రోజన్ రంగంలో పెట్టుబడులు, స్విస్ సాంకేతిక సాయం తదితర అంశాలపై మంత్రి నారా లోకేశ్ దావోస్ పర్యటన మూడో రోజు పెట్టుబడుల వేట కొనసాగించారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను వారికి వివరించారు. భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి దాటే వరకు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో లోకేశ్ భేటీలు కొనసాగాయి.
ఏపీలో టైర్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని అపోలో టైర్స్ వైస్ ఛైర్మన్ నీరజ్ కన్వర్‌కు మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు. ఆటోమేటివ్ పరిశ్రమలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్‌లో కొత్త టైర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. టైర్ టెక్నాలజీ ఆవిష్కరణలు, రాష్ట్ర నాలెడ్జ్ ఎకానమీకి దోహదపడేలా రాష్ట్రంలో ఆర్అండ్డీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. టైర్ల తయారీ, నిర్వహణలో శ్రామికశక్తిని తయారుచేసేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల కోసం స్థానిక విద్యాసంస్థలతో కలసి పనిచేయాలని ఆయన విజ్ఞప్తిచేశారు.
స్థిరమైన సప్లయ్ చైన్ నిర్ధారణ, స్థానిక వ్యవసాయ రంగానికి మద్ధతు ఇవ్వడానికి రబ్బరు తోటలు, ప్రాసెసింగ్ కోసం మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలని లోకేశ్ కోరారు. ఏపీలో పర్యావరణ సుస్థిరత, సమాజాభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందని చెప్పారు. అందుకే కార్పొరేట్ సామాజిక బాధ్యత కార్యక్రమాల్గో పాల్గొనాలని ఆయన కోరారు. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తులపై సహచర ఎగ్జిక్యూటివ్‌లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అపోలో టైర్స్ వైస్ ఛైర్మన్ నీరజ్ కన్వర్ తెలిపారు.
Lokesh Meets Global Leaders in Davos : గ్రీన్ హైడ్రోజన్ 2030నాటికి రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, ఏడున్నర లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని లోకేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ–2024 రెన్యువబుల్ ఎనర్జీ పరిశ్రమ విడిభాగాల తయారీని కూడా ప్రోత్సహిస్తుందన్నారు. ఎన్విజన్ సీఈఓ లీ జంగ్‌తో మంత్రి భేటీ అయ్యారు.
రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులకు ఏపీలో పూర్తి అనుకూల వాతావరణం నెలకొని ఉందని లోకేశ్ వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో రెన్యువబుల్ ఎనర్జీ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుచేసి, ప్రోత్సాక ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్స్‌కు సంబంధించిన ప్రాజెక్టులు, సంబంధిత స్టార్టప్‌లకు ప్రతిభావంతులైన వర్క్ ఫోర్స్‌ను అభివృద్ధి చేసేందుకు శిక్షణా కార్యక్రమాలు, వర్క్ షాపులు నిర్వహించాలని కోరారు. ఆంధప్రదేశ్ విజ్ఞప్తిపై డైరక్టర్ల బోర్డులో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎన్విజన్ సీఈఓ లీ జంగ్ తెలిపారు.
క్రిస్టెల్లాతో మంత్రి లోకేశ్ భేటీ : కాంటన్ ఆఫ్ వాడ్ స్టేట్ కౌన్సిలర్ క్రిస్టెల్లాతో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. స్విస్ నుంచి సాంకేతిక వస్త్రాలు, యంత్రాల తయారీ, హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్, రైలు, రైలు విడిభాగాల తయారీ, ఫార్మాస్యూటికల్స్, వైద్య పరికరాల తయారీలో ఆర్అండ్డీ హబ్‌లు, విశ్వవిద్యాలయాల సహకారాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. ట్రేడ్ అండ్ ఎకనమిక్ పార్టనర్ షిప్ అగ్రిమెంట్ ద్వారా స్థానిక తయారీదారులు యూరోపియన్ మార్కెట్‌కు కనెక్ట్ చేసేలా సహకారం అందించాలని కోరారు. ఇంజినీరింగ్, హెల్త్ సైన్సెస్, రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో పరిశోధనలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ కీలకరంగాల్లో స్విస్ కంపెనీల పెట్టుబడులకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని హామీ క్రిస్టెల్లా హామీ ఇచ్చారు.
దావోస్‌లో మంత్రి లోకేశ్ బిజీబిజీ - పలు కంపెనీల ప్రతినిధులతో వరుస భేటీలు
పరిశ్రమల ఏర్పాటుకు ఏపీలో పూర్తి సానుకూల వాతావరణం: నారా లోకేశ్