KARONDA CULTIVATION IN AP: కొరండా సాగు రైతులకు కాసులు కురిపిస్తోంది. దీంతో కూటమి ప్రభుత్వం సైతం ఉద్యాన రైతులకు ఊతమిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలోని ఉద్యాన రైతులు ప్రస్తుతం కొత్త పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. కొరండా మొక్కల సాగు విస్తరణకు ఉద్యానశాఖ దృష్టి సారించింది. కొద్దిపాటి ముళ్లు కలిగి చిన్న చెట్లుగా వృద్ధి చెందే కొరండా మొక్కలు నీటి ఎద్దడి పరిస్థితులు తట్టుకుని వర్షాధార పంటగా వృద్ధి చెంది దిగుబడులు ఇస్తోంది.
సాగు విధానం ఇలా : కొరండా ప్రధాన పంటగా ఎకరాకు 250 మొక్కల చొప్పున నాటుకోవాలి. దీనికి పెద్దగా సాగు ఖర్చులు ఉండకపోగా మంచి దిగుబడి ఇస్తుంది. ఇతర పండ్ల తోటలు లేదా పొలం చుట్టూ కంచె పంటగా సైతం కొరండాను నాటుకోవచ్చు. పంట సాగుచేస్తే ప్రోత్సాహకంగా హెక్టారుకు రూ.30 వేలు రాయితీగా విడతల వారీగా మూడేళ్లు అందజేస్తారు.
వర్షాభావ పరిస్థితులు తట్టుకుని పంట దిగుబడినిచ్చి అదనపు ఆదాయంగా ప్రత్యామ్నాయ పంటగా సాగు చేసుకోవచ్చు. కొరండా మొక్కలు నేరుగా గానీ, ప్రభుత్వ నర్సరీలలో గానీ సేకరించి నాటుకోవచ్చు. ఉద్యాన శాఖాధికారులకు మొక్కల బిల్లులు అందజేస్తే రాయితీ మొత్తాన్ని పొలం పరిశీలన తర్వాత అందజేస్తారు. దీని సాగుకు చిత్తూరు జిల్లా అనుకూలం. ఆసక్తి కలిగిన రైతులు మొక్కలు సేకరించి నాటుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
మార్కెట్‌లోకి అత్యంత ఖరీదైన పండు! - ఒక్కో స్టేజ్లో ఒక్కో రంగు!
కొరండా ఉపయోగాలు : కొరండా కాయలు పచ్చళ్లు, చట్నీలకు విరివిగా ఉపయోగిస్తారు. వీటి కాయలతో చేసిన పచ్చుళ్లు, చట్నీలు ఎంతో టేస్టీగా ఉంటాయి. పండు బారిన కాయలు ఎర్రగా అత్యంత ఆకర్షణీయంగా ఉండి బేకరీలలో చెర్రీగా వినియోగిస్తారు. ఒక మొక్క నాటిన మూడేళ్ల నుంచి దిగుబడులు వస్తాయని వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. ఒక్క చెట్టుకు 3-4 కిలోల కాయలు వస్తాయని వివరించారు. యాజమాన్య పద్ధతులు పాటిస్తే 10 కిలోలు పొందవచ్చు. మార్కెట్లో కిలో పచ్చి కాయలు రూ.100, పండు కాయలు రూ.250 ధర పలుకుతోంది.
చిత్తూరు జిల్లాలో ఈ ఏడాది ఇప్పటికే 20,900 మొక్కలు రైతులకు సరఫరా చేసి 83.6 ఎకరాల్లో సాగు ప్రోత్సహించామని, కొరండా మొక్కలు, సాగు సలహాలు, సూచనలు, ప్రోత్సాహక రాయితీలు తదితర వివరాలకు మండల ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు.
ఇది స్వర్గఫలం గురూ! ఒక్క పండు ధర 1500 - తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడే మొట్టమొదటి సారి సాగు