Died Man Get Up incident in Srikakulam District : ఆయనకు వయసురీత్యా గత కొన్నేళ్లుగా వెంటాడుతున్న అనారోగ్యం. ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినా ఇక బతకడం కష్టమేనని తెల్చిచెప్పిన డాక్టర్లు. చివరికి 85 ఏళ్ల ఆ వృద్ధుడు చనిపోయాడని అందరూ అనుకున్నారు. ఇక అంత్యక్రియలకు కూడా ఏర్పాట్లు చేశారు. చివరికి శ్మశానానికి తరలిద్దామనేలోగా లేచి కూర్చున్నారు. ఈ అరుదైన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో బుధవారం వెలుగుచూసింది.
దహన సంస్కారాలకు ఏర్పాట్లు : పూర్తి వివరాల్లోకి వెళ్తే, జి.సిగడాం మండలం సీతంపేటకు చెందిన ధర్మవరపు అప్పారావు(85) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన కుటుంబసభ్యులు జిల్లా కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు చికిత్సకు ఆయన శరీరం స్పందించట్లేదని గుర్తించారు. మరి కొద్దిసేపట్లో చనిపోతాడని ధ్రువీకరించారు. దీంతో కుటుంబసభ్యులు అప్పారావును తీసుకొని అంబులెన్స్‌లో గ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యలోనే ప్రాణం పోయిందని భావించిన కుటుంబసభ్యులు దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేయాలని తమ బంధువులకు సమాచారం ఇచ్చారు.
ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు : అంబులెన్సు ఇంటివద్దకు చేరుకోగానే అప్పారావును చూసిన వారందరూ భోరున విలపించారు. చనిపోయాడని నమ్మిన కుటుంబసభ్యులు అప్పారావును శ్మశానానికి తీసుకెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా అప్పారావు కళ్లు తెరిచి, కాళ్లు కదిలించడంతో అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. 15 నిమిషాల్లోనే మంచంపై నుంచి లేచి కూర్చోవడంతో కుటుంబసభ్యులు ఆనందించారు.
మరణించాడని అంత్యక్రియలు... కానీ అంతలోనే..!
చనిపోయిన కుమారుడికి అంత్యక్రియలు.. చిన్న కర్మ రోజు ఏం జరిగిందంటే..!