Cybercriminals Robbed RS 2 Crore in Stock Trading Scam :సైబర్ కేటుగాళ్ల ఆగడాలకు అడ్డే లేకుండా పోతుంది. రోజుకో అవతారం ఎత్తి అమాయకుల డబ్బులను కొల్లగొట్టేస్తున్నారు. పోలీసులు వారిని నిలువరించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. తాజాగా షేర్లు విక్రయిస్తానంటూ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు రూ.10 వేలు ఆశ చూపి ఏకంగా రూ.2.29 కోట్లను సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది. మోసపోయాయని గ్రహించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సైబర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, హైదరాబాద్‌లోని బాచుపల్లికి చెందిన సాఫ్ట్వేర్ (51) ఫోన్ నంబర్‌ను జులై 10న గుర్తు తెలియని వ్యక్తులు స్టాక్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో చేర్చారు. ఆ వాట్సాప్ గ్రూపు పేరు కేఎస్ఎల్ అఫీషియల్ స్టాక్. ఈ వాట్సాప్ గ్రూపులో నారాయణ జిందాల్ అనే వ్యక్తి కోటక్ సెక్యూరిటీస్‌లో చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తున్నారని, షేర్ల విక్రయాలపై మెలకువలు నేర్పిస్తుంటారని గ్రూపులో తరచూ ఛాటింగ్ చేసేవారు. ఈ క్రమంలో అక్టోబరు 2 నుంచి కోటక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ స్ట్రాటజీ ప్లాన్ ప్రారంభిస్తున్నానంటూ నారాయణ జిందాల్ పేరుతో ఆ వాట్సాప్ గ్రూపులో ఒక వ్యక్తి పోస్టు చేశారు. ఇందులో చేరాలంటే కోటక్ ప్రో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. వీఐపీ ట్రేడింగ్ ప్లాన్‌లో చేరితే లాభాలు వస్తాయని ఆశ చూపించేవాడు.
యాప్‌లో సాఫ్ట్వేర్ పెట్టుబడి : వారు చెప్పిన ప్లాన్‌లో చేరినందుకు తమకు లాభాలు వచ్చాయని గ్రూపు సభ్యుల పేరుతో సందేశాలు పోస్టు చేసేవారు. ఇదంతా నిజమేనని నమ్మిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. అందులో కస్టమర్ కేర్ ప్రతినిధి సూచనల ప్రకారం డబ్బులు పంపేవాడు. ముందుగా తొలిసారి రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టినందుకు 10 శాతం లాభం వచ్చినట్లు యాప్‌లో చూపించారు. దీంతో ఇదంతా నిజమేనని నమ్మిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ దఫదఫాలుగా మరో రూ.90 లక్షలు అందులో పెట్టుబడి పెట్టాడు.