Bank Accounts Misuse News : ఇతరుల బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలను తీసుకుని నేరగాళ్లు తమ వ్యవహారాలను సాఫీగా కొనసాగిస్తున్నారు. పోలీసుల దర్యాప్తులో చివరకు అమాయకులే దొరుకుతున్నారు. విజయవాడకు చెందిన ఓ వస్త్ర వ్యాపారికి ఇటీవల గుజరాత్ పోలీసుల నుంచి ఓ నోటీసు వచ్చింది. మీ ఖాతా నుంచి అక్రమ లావాదేవీలు జరిగాయి విచారణ కోసం హాజరుకావాలని ఉంది. అది చూసిన ఆ వ్యాపారి ఆందోళనతో పోలీసులను సంప్రదించాడు.
తన బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్ చూసుకోగా రూ. కోట్లలో లావాదేవీలు జరిగినట్లు తెలిసి విస్తుపోయాడు. ఎలా జరిగిందని ఆలోచించగా వ్యాపార పని మీద నాలుగు నెలల కిందట దిల్లీ వెళ్లాడు. అక్కడ పరిచయం ఉన్న ఓ వ్యాపారి కలిశాడు. ఓ గేమింగ్ యాప్ సంస్థకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని రోజులు నీ బ్యాంకు ఖాతా కావాలని వివరాలు ఇచ్చినట్లు గుర్తొచ్చింది. అలా ఖాతా వివరాలు వెళ్లాయని పోలీసులకు వివరించాడు.
మీ ఖాతాలో పెద్దమొత్తంలో లావాదేవీలు జరిగితే మీకు అంతే స్థాయిలో రుణ అర్హత పెరుగుతుంది. సిబిల్ స్కోర్ కూడా బాగా ఎగబాకుతుంది. వీటితోపాటు మీకు కమీషన్ కూడా వస్తుందని కేటుగాళ్లు పలువురు ఖాతాదారులకు ఆశపెట్టి బ్యాంకు ఖాతాలు తీసుకుని తమ ఆర్థిక లావాదేవీలకు వీరి ఖాతాలను ఉపయోగిస్తున్నారు.
డిజిటల్ అరెస్టు కేసు :విజయవాడలో ఇటీవల నమోదైన డిజిటల్ అరెస్టు కేసులో ఫిర్యాదుదారు నుంచి బదిలీ అయిన బ్యాంకు ఖాతా వివరాలను పోలీసులు గుర్తించారు. పుణెలో నలుగురి పేర్లతో కరెంటు ఖాతా ఉన్నట్లు తేలింది. వారి కోసం గాలించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని విజయవాడకు తీసుకువచ్చారు. వారిని విచారణ చేస్తే జరిగిన లావాదేవీలకు వీరికి సంబంధం లేదని తేలింది.