CPI D Raja Fires on BJP Party : రాష్ట్రంలో సీపీఐ రాష్ట్ర సమావేశాలు ముగిశాయి. మూడు రోజుల పాటు జరిగిన ఈ సమావేశాలకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,జాతీయ కార్యదర్శులు నారాయణ, అజీజ్ పాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, పార్లమెంట్ ఎన్నికలు, పార్టీ బలోపేతం అంశాలపై చర్చలు జరిపారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ సందర్భంగా డి.రాజా మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశానికి విపత్తు అని డి. రాజా వ్యాఖ్యానించారు. బీజేపీ ఓటమి కోసం పని చేస్తామని స్పష్టం చేశారు. మూడు రోజుల పాటు సమావేశాలు జరిగాయని తెలిపారు. ఫిబ్రవరి 16న జరిగే రైతు సంఘాలు నిర్వహించే ధర్నాకు సీపీఐ ఎప్పుడూ మద్దతుగా ఉంటుందని తెలిపారు. ఆంధ్ర ప్రత్యేక హోదా కోసం మద్దతిస్తామన్నారు. మోదీ మూడోసారి అధికారంలోకి వస్తామని, భారత ఆర్థిక వ్యవస్థను 3వ స్థానానికి తెస్తామని అంటున్నాడన్న ఆయన, మోదీ ఇస్తున్న హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. 2 కోట్ల ఉద్యోగాలు, నల్లధనం వెనక్కి తేలేదేమని ప్రశ్నించారు. మధ్యంతర బడ్జెట్లో పేద, మధ్య తరగతి వారి కోసం ఏమీలేదని మండిపడ్డారు.
'మోదీ మూడోసారీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డువచ్చిన వారిని తొలగించుకుంటూ పోతున్నారు'
"ఈసారి ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. బీజేపీ ఎలాగైనా అధికారంలోకి రాకుండా చూడాలి. పార్లమెంట్ సమావేశాల్లో 100 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ఇలా చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతిపక్షానికి ఉంది. బీజేపీ ప్రతిపక్షాలు ఉండకూడదని అనుకుంటుంది. ప్రతిపక్షాలు లేకుంటే వారు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చని అనుకుంటారు. ఇవే మా సమావేశాల్లో మేం చర్చించాం." - డి.రాజా, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి