Stepwells Renovation in Hyderabad :భాగ్యనగరంలోని పురాతన మెట్లబావుల అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. వీటి పునరుద్ధరణకు పలు పారిశ్రామిక సంస్థలు ముందుకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పర్యాటకశాఖతో సీఐఐ ఒప్పందం చేసుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మహాలఖా మెట్ల బావిని ఇన్ఫోసిస్, సాలార్ జంగ్, అమ్మపల్లి బావులను భారత్ బయోటెక్ పునరుద్ధరించేందుకు ఒప్పందాలు చేసుకున్నాయి. అడిక్‌మెట్ మెట్ల బావిని దొడ్ల డైరీ, ఫలక్‌నుమా మెట్ల బావిని టీజీఆర్టీసీ, రెసిడెన్సీ మెట్ల బావిని కోఠి మహిళ కళాశాల పునరుద్ధరించేందుకు ముందుకొచ్చాయి.
తెలంగాణ దర్శినికి శ్రీకారం :రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రూపొందించిన "తెలంగాణ దర్శిని" కార్యక్రమానికి సంబంధించిన జీవోను జారీ చేసినట్లు సీఎం రేవంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ సంస్థలలో చదివే విద్యార్థులను కేటగిరీలుగా విభజించి, ఆయా ప్రాంతాల్లోని పర్యాటక క్షేత్రాలను ఉచితంగా చూపిస్తారు. రవాణా, ఇతరత్రా ఖర్చుల కోసం ప్రభుత్వం రూ12.10 కోట్ల నిధులను సైతం విడుదల చేసింది.
మూసీ చారిత్రక భవనాల అభివృద్ధి :హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళతామన్నారు. మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, మూసీ పరీవాహకంలోని చారిత్రక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దనున్నట్లు సీఎం తెలిపారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నగరంలోని అనేక చారిత్రక కట్టడాలు శిథిలావస్థకు చేరుకున్నాయని సీఎం అన్నారు.