MMTS Trains Shortage Issue :ఎంఎంటీఎస్ రెండో దశ పనులు పూర్తయ్యాయి. దీంతో మౌలాలి- సనత్‌నగర్ మధ్య కొత్తగా 6 స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ప్రయాణికులు మౌలాలి నుంచి హైటెక్‌సిటీ మీదుగా లింగంపల్లికి నేరుగా చేరుకునే వెసులుబాటు కలిగింది. ఈ రూట్లో నిత్యం సాధారణ ప్రయాణికులతో పాటు 30వేల మంది ఐటీ ఉద్యోగులు కూడా రాకపోకలు సాగిస్తుంటారు. కానీ దక్షిణ మధ్య రైల్వే ఒకే ఒక ఎంఎంటీఎస్‌ను నడుపుతుండటంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
రూ.40తో అరగంటలో హైటెక్‌సిటీకి :మౌలాలి-సనత్‌నగర్ మధ్య 6 స్టేషన్లు అందుబాటులోకి రావడంతో రూ.40 టికెట్‌తో అరగంటలో హైటెక్‌సిటీకి చేరుకోవచ్చని ఐటీ ఉద్యోగులు భావించారు. కానీ ఒకే ఒక ఎంఎంటీఎస్ ఆఫీసులకు వెళ్లే సమయానికి అనువుగా లేదు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు 4 ఎంఎంటీఎస్‌లు నడిపితే ఉపయుక్తంగా ఉంటుందని కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధి బి.టి.శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.