Hydra Commissioner Ranganath Latest Comments :పేదలను ముందు పెట్టి చక్రం తిప్పుతున్న భూకబ్జాదారులపై కఠిన చర్యలు తప్పని హైడ్రా మరోసారి హెచ్చరించింది. పాత్రదారులు, సూత్రదారులు ఎవ్వరైనా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. జులై తర్వాత అనుమతి లేకుండా నిర్మించే కట్టడాలనే హైడ్రా కూల్చి వేస్తుందనే ప్రకటనతో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో స్పందించిన రంగనాథ్ ఇప్పటి వరకు హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన సమగ్ర వివరణ ఇస్తూ ఆయా వివరాలను వెల్లడించారు. హైడ్రా రాకముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను కూల్చబోమని, ఎఫ్ టీఎల్‌లో అనుమతి లేకుండా కట్టిన ఎన్ కన్వెన్షన్ లాంటివాటిని కూల్చక తప్పదని రంగనాథ్ పునరుద్ఘాటించారు.
హైదరాబాద్ మహానగరంలో ప్రభుత్వ స్థలాలు, పార్కుల పరిరక్షణతో పాటు చెరువుల పునరుద్ధరణకు కృషి చేస్తోన్న హైడ్రాపై విమర్శలు వెల్లువెత్తున్న వేళ కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైడ్రా వెనక్కి తగ్గిదంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ హైడ్రా పనితీరుపై సమగ్ర వివరాలను వెల్లడించారు. హైడ్రా రాకముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలనూ కూల్చబోమని, అనుమతి లేకుండా కట్టిన నివాస గృహాలు జూలై 2024కి సిద్ధమై, వాటిలో నివాసం ఉంటే కూల్చదని రంగనాథ్ స్పష్టం చేశారు.
అవి అక్రమ కట్టడాలే :ఎఫ్టీఎల్‌లో అనుమతులు లేకుండా కట్టిన ఎన్ కన్వెషన్ లాంటి వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం కూల్చక తప్పదన్నారు. గతంలో అనుమతులు ఇచ్చి తరువాత రద్దు చేస్తే ఆ కట్టడాలు అక్రమకట్టడాలుగా పరిగణిస్తామని వివరించిన రంగనాథ్ అనుమతులు రద్దయినప్పటికీ నిర్మాణాలు జరుగుతున్న వాటిని కూడా అక్రమ కట్టడాలుగా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుందన్నారు.
"ఆ ఇళ్లను కూల్చం - వీటిని వదలం" : హైడ్రా కమిషనర్ కీలక వ్యాఖ్యలు
మల్లంపేట కత్వా చెరువు, అమీర్‌పూర్‌లో కూల్చివేతలు అక్రమ కట్టడాల కిందకే వస్తాయన్నారు. పేదలను ముందుపెట్టి వెనుక నుంచి చక్రం తిప్పుతున్న భూ కజ్జాదారులను ఉపేక్షించేది లేదని, చింతల్, గాజులరామారం, మాదాపూర్‌లోని సున్నం చెరువులో కూల్చివేతలను కబ్జాదారుల్లో ఉన్నవేనని తెలిపారు. గడిచిన 5 నెలల్లో 12 చెరువుల్లోని అక్రమ నిర్మాణాలను కూల్చివేసి దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. 12 చెరువులలో పునరుద్ధరణకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించామని, ప్రభుత్వ అనుమతులు వచ్చిన వెంటనే పనులు మొదలుపెట్టనున్నట్లు రంగనాథ్ వివరించారు. సున్నం చెరువులో కూల్చివేతల తర్వాత కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు మళ్లీ నిర్మాణాలు చేపట్టారని, వాటన్నింటిని కూల్చివేసి రాబోయే రోజుల్లో ఆ చెరువుకు ఎఫ్టీఎల్ నిర్ధారించి పునరుద్ధరణ చర్యలు చేపడతామని రంగనాథ్ వివరించారు.
లోటుపాట్లు ఉంటే సవరించుకుని నిబద్ధతో ముందుకు : ప్రభుత్వ దిశానిర్దేశం మేరకే హైడ్రా పనిచేస్తుందని, వివిధ సందర్భాల్లో కోర్టులు ఇచ్చిన తీర్పునకు లోబడి హైడ్రా ముందుకెళ్తుందన్నారు. అలాగే హైడ్రాను బలోపేతం చేయడానికి ప్రభుత్వం పలు అధికారాలను కట్టబెట్టిందన్న ఆయన సాంకేతికంగా కూడా హైడ్రా మరింత బలంగా తయారవుతుందన్నారు. హైదరాబాద్‌లో చెరువుల ఎఫ్టీఎల్ మార్కింగ్ ప్రక్రియ ఇప్పటికే హైడ్రా మొదలు పెట్టిందన్నారు. ఎఫ్‌టీఎల్ మార్కింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు రంగనాథ్ వివరించారు. 5 నెలల అనుభవాల నుంచి హైడ్రా అనేక అంశాలపై స్పష్టమైన వైఖరితో ముందుకెళ్తోందన్నారు. లోటుపాట్లు ఏమైనా ఉంటే వాటిని సవరించుకొని మరింత నిబద్ధతతో హైడ్రా పనిచేస్తోందని రంగనాథ్ స్పష్టం చేశారు.
త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు :అలాగే హైడ్రాకు వస్తున్న ఫిర్యాదులపై కూడా రంగనాథ్ స్పందించారు. కాలనీ సంక్షేమ సంఘాలు, ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు తమ ప్రాధాన్యత ఉంటుందన్న రంగనాథ్ ప్రజలు పెద్ద ఎత్తున హైడ్రాపై నమ్మకంతో ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 5 వేలకుపైగా ఫిర్యాదులను హైడ్రా పరిష్కరించిందన్నారు. పలు ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటినింటిని క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే చర్యలు తీసుకుంటామని రంగనాథ్ తెలిపారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రంగనాథ్ ప్రకటించారు. భూ కబ్జాల వెనక ఉన్న పాత్రదారులు, సూత్రదారులపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పని రంగనాథ్ హెచ్చరించారు.
కుంట్లూరు చెరువులో నుంచి రహదారి ఎలా వేస్తారు? - రంగనాథ్ సీరియస్
ప్రభుత్వ స్థలంలో ఫంక్షన్ హాల్ - నేలమట్టం చేసిన హైడ్రా