CM Revanth Review On Family Digital Health Cards: కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం అక్టోబర్ 3న పైలట్ ప్రాజెక్టు ప్రారంభించి ఇంటింటి పరిశీలన చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, సంక్షేమ పథకాల్లో డేటా ఆధారంగా ప్రస్తుతం కుటుంబాన్ని నిర్ధారించి క్షేత్రస్థాయి పరిశీలన చేయాలన్నారు. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డు వంటి అనవసర సమాచారం సేకరించవద్దని సీఎం స్పష్టం చేశారు. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక పట్టణ, ఒక గ్రామీణ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టాలన్నారు.
మహిళే యజమానిగా హెల్త్ కార్డులు :మహిళే యజమానిగా కుటుంబ డిజిటల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కార్డు వెనకాల కుటుంబంలోని ఇతర సభ్యుల వివరాలు ఉండాలని సూచించారు. కుటుంబ డిజిటల్ కార్డులపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈనెల 25 నుంచి 27 వరకు రాజస్థాన్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో పర్యటించిన అధికారులు అధ్యయనాల వివరాలు పవర్ పాయింట్ ప్రజెంటేన్ ద్వారా సీఎంకు తెలిపారు.
కార్డులు ఇచ్చిన ఇతర రాష్ట్రాల్లోని ఉపయోగకరమైన అంశాలను స్వీకరించాలని సీఎం సూచించారు. కుటుంబ డిజిటల్ కార్డుల్లో ఏయే వివరాలు ఉండాలని అప్ డేట్ ఎలా చేసుకోవాలనే వివరాలను రేపు సాయంత్రంలోగా కేబినెట్ సబ్ కమిటీకి నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి తెలిపారు. మంత్రివర్గ ఉప సంఘం సూచనల మేరకు మార్పులు, చేర్పులు చేసి తుది నివేదిక తయారు చేయాలన్నారు.