CM Revanth Reddy Goal is a Drug Free Telangana : డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి యువత సహకరించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత తెలంగాణపై తన వంతు బాధ్యతగా చిరంజీవి ఇటీవల ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా స్పందించారు. డ్రగ్స్‌పై పోరాడుతున్న చిరంజీవిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ పరిశ్రమపై ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో పోలీసుల ప్రత్యేక వాహనాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై సినీ పరిశ్రమ యువతకు అవగాహన కల్పించట్లేదని పేర్కొన్నారు. టికెట్ ధరల పెంపు, సినిమా చిత్రీకరణ అనుమతుల కోసం వచ్చే వారికి ముందస్తు షరతులు విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. సినిమాలో నటించే వారితో డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన వీడియో చిత్రీకరించాలని సూచించారు. ఇలా రెండు నిమిషాల పాటు వీడియో చిత్రీకరించి ఇవ్వాలన్నారు. ఈ విధంగా సినిమా హాల్లో సైబర్ నేరాలు, డ్రగ్స్‌పై అవగాహన వీడియోలు ఫ్రీగా ప్రదర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ విషయంపై త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ విధానాలను సినీ పెద్దలకు వివరిస్తామని పేర్కొన్నారు. టీవీలో కూడా డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన చిత్రాలు ప్రదర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
అధికారుల్లో నైపుణ్యంతో పాటు ఆత్మస్థైర్యాన్ని నింపడం తమ బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పోలీసులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించడం ప్రభుత్వ బాధ్యతనని వివరించారు. చదువుకున్న వారు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారని ఆవేదన చెందారు. సైబర్ నేరాళ ఫిర్యాదుకు 1930 టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేశామని అన్నారు. నేరగాళ్ల నుంచి సైబర్ క్రైమ్ పోలీసులు రూ.31 కోట్లు రాబట్టారని తెలిపారు. కొత్త నేర న్యాయ చట్టాలపై కూడా పోలీసులకు శిక్షణ ఇవ్వాల్సి ఉందని వెల్లడించారు.