CM Revanth Reddy Review On Indiramma Houses :ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇందిరమ్మ ఇళ్లపై తన నివాసంలో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారికి, పారిశుద్ధ్య కార్మికులు తదితరులకు ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
శాఖాపరంగా ఎలాంటి పొరపాట్లకు తావివ్వవద్దు :తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. గ్రామ కార్యదర్శి, మండల స్థాయి అధికారులను భాగస్వామ్యం చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్‌లో లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. లబ్ధిదారుకు ఇబ్బంది కలగనీయవద్దని, శాఖాపరంగా ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వొద్దని పునరుద్ఘాటించారు.
ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రత్యేక కోటా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపితే అందుకు అవకాశం కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.