CM Revanth Reddy Review Meeting on Nizam Sugars: నిజాం షుగర్స్ పునరుద్ధరణపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Nizam Sugars Company History: ఒకప్పుడు ఆసియాలో అతిపెద్ద నిజాం షుగర్స్ పరిశ్రమలో మూడు యూనిట్లు మూతపడ్డాయి. దీన్ని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో 1983లో మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ నిర్మించారు. 2002లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 51 శాతం వాటాలను డెక్కన్ పేపర్స్ లిమిటెడ్(Deccan Papers Ltd)కు విక్రయించింది. దీంతో ఎన్ఎస్డీఎల్(నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్)గా మార్చారు. 2014లో బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్) ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ- ప్రైవేట్ భాగస్వామ్యంలో కొనసాగుతున్న పరిశ్రమను సహకార సంఘంగా కొనసాగించాలని 2015లో గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఫ్యాక్టరీ ఆర్థికంగా లాభదాయకంగా లేనందున ప్రభుత్వం దానిని నడపలేదని మాజీ సీఎం కేసీఆర్ గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు. దీంతో 2017లో ప్రైవేట్ మేనేజ్‌మెంట్ లిక్విడేషన్ కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. ఇది మూడు యూనిట్లను మూసివేయడానికి దారితీసింది.
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ - బడ్జెట్ సమావేశాల తేదీలు, గ్యారంటీల అమలుపై చర్చ
CM Revanth Reddy on Nizam Sugars Company : 2015లో మూతపడ్డ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను రీఓపెన్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడంతో చెరుకు రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ ఆధీనంలో నడిపిస్తామన్న బీఆర్ఎస్ పార్టీ పెద్దలు గద్దెనెక్కాక ఆ విషయమే మరచిపోయారు. అంతేగాక ఫ్యాక్టరీ పూర్తిగా మూతపడినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మూత పడ్డ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సైతం ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. దీంతో మళ్లీ ఫ్యాక్టరీలకు పూర్వ వైభవం వస్తుందని, తమకు మంచి రోజులు వస్తాయని వేలాది మంది చెరుకు రైతులు, కార్మికులు భావిస్తున్నారు.