CM Revanth Review on Health Cards :రాష్ట్రంలో కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి కార్యచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. డిజిటల్ కార్డులపై మంత్రులు దామోదర రాజనర్సింహా, ఉత్తమ్ కుమార్‌రెడ్డితో కలిసి వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో సీఎం సమక్ష నిర్వహించారు. కుటుంబ డిజిటల్ కార్డుల జారీ కోసం ప్రతీ నియోజకవర్గంలో ఒక పట్టణం, ఒక గ్రామంలో పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.
పథకాలన్నింటికీ వన్ కార్డు : రాష్ట్రంలో వన్ స్టేట్, వన్ డిజిటల్ కార్డు విధానం అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. రేషన్, ఆరోగ్య సేవలతో పాటు సంక్షేమ పథకాలన్నీ ఒకే కార్డు ద్వారా అమలు చేసేలా ప్రణాళిక చేస్తోంది. కుటుంబ డిజిటల్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా సంక్షేమ పథకాలు పొందేలా ప్రణాళిక చేయాలని సీఎం సూచించారు. డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యులందరి హెల్త్ ప్రొఫైల్ పొందుపరిచి, దాని ద్వారానే ఆరోగ్య సేవలు అందించాలన్నారు. అర్హులందరికీ కుటుంబ డిజిటల్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాల వారీగా ప్రత్యేక వ్యవస్థ ఉండాలని సీఎం సూచించారు. రాజస్థాన్, హర్యానా, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
రేషన్‌కార్డుల జారీపై ఫోకస్ : మరోవైపు రాష్ట్రంలో నూతన రేషన్‌కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇక కొత్త రేషన్‌కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘం విధి విధానాల రూపకల్పనలో నిమగ్నమయ్యింది. ఈ క్రమంలో ఆయా కుటుంబాల వార్షిక ఆదాయ పరిమితిని కూడా నిర్ణయించనుంది.