Electric Salt Spoon Kirin : మీ వంటలో ఉప్పు తక్కువైందా? ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదని డాక్టర్ సిఫారసు చేశారా? లేక ఉప్పు వాడకం తగ్గించాలనుకుంటున్నారా? మీలాంటి వారి కోసమే ఓ కంపెనీ అద్భుతమైన పరికరాన్ని కనిపెట్టింది! దీనితో తింటే- సాల్ట్ లేకపోయినా ఆహారం మరింత టేస్టీగా మారనుంది! అసలు ఆ పరికరమేంటి? అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
'సాల్ట్ స్పూన్- ఇందులో ఉప్పులేదు'
ఈ సాల్ట్ స్పూన్ ఒక ఎలక్ట్రిక్ పరికరం. ఆహారంలో ఉప్పు తక్కువైతే, ఈ స్పూన్‌తో తింటే సరిపోతుంది. ఆహారం మరింత టేస్టీ, సాల్టీగా మారుతుంది. అయితే ఉప్పు కలపకుండానే ఆహారానికి మంచి రుచి వస్తుంది.
ఎలా పనిచేస్తుంది?
ఆహారం తినేటప్పుడు స్పూన్ నాలుకకు తాకుతుంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ స్పూన్ కరెంట్‌ను నాలుకకు పంపిస్తుంది. దీంతో మనకు ఉప్పు తిన్న అనుభూతి కలుగుతుంది. ఈ ఎలక్ట్రిక్ స్పూన్లో రెండు భాగాలుంటాయి. ఒకటి కింది భాగంలో ఉండే స్పూన్ బౌల్, రెండోది హ్యాండిల్. ఈ హ్యాండింల్లోనే పవర్, మెనూ బటన్స్ ఉంటాయి. ఇందులో ఉండే నాలుగు మోడ్ల ద్వారా సాల్ట్నెస్ స్థాయిలను సెట్ చేసుకోవచ్చు.
ఇందులో విచిత్రం ఏంటంటే ఈ పరికరం సరైన దిశలో పట్టుకుంటేనే పనిచేస్తుంది. లేకుంటే ఆగిపోతుంది. ఈ స్పూన్‌తో తినేటప్పుడు హ్యాండిల్ మీద ఉన్న బ్లూ లైట్, తెలుపు రంగులోకి మారుతుంది. సరైన దిశలో పట్టుకుంటేనే సుమా.
ఈ పరికరాన్ని జపనీస్ కంపెనీ 'కిరిన్' తయారు చేసింది. మీజీ యూనివర్శిటీ డాక్టర్ హోమీ మియాషితా లాబొరేటరీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్రాంటియర్ సైన్స్, స్కూల్ ఆఫ్ ఇంటర్‌డిసిప్లినరీ మ్యాథమెటికల్ సైన్సెస్‌తో సంయుక్తంగా ఈ సాంకేతికతను అభివృద్ధి చేసినట్లు కిరిన్ పేర్కొంది. ఈ ఎలక్ట్రిన్ స్పూన్‌ను అమెరికాలోని న్యూయార్క్‌లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో(సీఈఎస్ - ప్రపంచంలోనే అతిపెద్ద కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిబిషన్ ఈవెంట్)లో ఆవిష్కరించింది.
అదే మా మిషన్!
మరోవైపు, ప్రజలు తక్కువ ఉప్పును వినియోగించేలా చేయడమే తమ మిషన్ అని కిరిన్ సంస్థ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫారసు చేసిన ఉప్పు స్థాయిల( 5.0g*5) కంటే 20ఏళ్లు పైబడిన జపాన్ వాసులు ఎక్కువ(10.1g*4) సాల్ట్ తీసుకుంటున్నారని కిరిన్ తన వెబ్సైట్లో పేర్కొంది. తమ దేశంలో ఇది చాలా కీలకమైన పోషకాహార సమస్య అని జపాన్ కార్మిక, ఆరోగ్య శాఖ తెలిపినట్లు కిరిన్ గుర్తుచేసింది.