Vaikunta Ekadasi 2025 in Tirumala : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఉత్తర ద్వారం దర్శనాలకు ముస్తాబైంది. ఇందుకోసం ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ సారి సామాన్య భక్తులకు సౌకర్యంగా స్వామివారి దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. పోలీసు, విజిలెన్స్ విభాగాల సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. జనవరి 10వ తేది నుంచి 19 వరకు 7 లక్షల మందికి ఉత్తర ద్వార గుండా దర్శనం కల్పించడం కోసం ఇప్పటికే ఆన్లైన్లో కొన్ని టికెట్లను అధికారులు విడుదల చేశారు. 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి తిరుమలలోని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సర్వ దర్శన టోకెన్లను జారీ చేయనుంది.
ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా : ప్రధాన ఆలయంతో పాటు తిరుమల పరిసర ప్రాంతాలను టీటీడీ సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులందరికీ ఆధ్యాత్మిక శోభ కలిగేలా ఆలయ మాఢ వీధుల్లో రంగవల్లులు, తోరణాలు, దేవత మూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు. మైసూరు దసరా ఉత్సవాల్లో ఏర్పాట్లు చేసే నిపుణులతో ఈ ఏడాది తిరుమలలో ప్రత్యేకంగా విద్యుత్, పుష్పాలంకరణ ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉదయం 5 గంటల నుంచే : ఉత్తర ద్వారం గుండా ఏడు లక్షల మందికి దర్శనం కల్పించేలా టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లతో సిద్ధమయ్యింది. తిరుపతిలో 8, తిరుమలలోని ఒక కేంద్రంలో ఏర్పాటుచేసిన 94 కౌంటర్ల ద్వారా ఈనెల జనవరి 10, 11, 12 తేదీలలో సర్వదర్శనం టోకెన్లు ఇవ్వనున్నారు. మొదటి మూడు రోజులకు సంబంధించి లక్షా 20 వేల టోకెన్లను 9వ తేదీ తెల్లవారుజామున 5 గంటల నుంచే జారీ చేయనున్నారు.
మిగిలిన రోజులకు సంబంధించి కేటాయించిన తేదీల్లో తిరుపతిలోని విష్ణునివాసం, భూదేవీ, శ్రీనివాసం కాంప్లెక్స్‌లలో ఇవ్వనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. బ్రేక్ దర్శనం సిఫార్సులు, వృద్ధులు, దివ్యాంగులు, చంటిపిల్లలు, ఎన్ఆర్ఐ కోటాల కింద కేటాయించే దర్శనానికి భక్తులను అనుమతించమని ప్రకటించారు. దీంతో పాటు శ్రీవారి కాలిమెట్ల మార్గంలో దర్శనం టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
Ekadashi Arrangements in Tirumala : ఈ ఏడాది వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో (ఎండోమెంట్ ఆఫీసర్) శ్యామలరావు తెలిపారు. జనవరి 10న తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు, 8 గంటల నుంచి సామాన్య భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలు ఉంటాయని వెల్లడించారు. పది రోజులపాటు అన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు చేశామని ఈవో తెలిపారు. కేవలం టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు.
"వృద్ధులు, దివ్యాంగులు, ఎన్నారై, బ్రేక్ దర్శనం, కోటా దర్శనాలను నిలిపివేశాం. పది రోజులపాటు అన్ని స్పెషల్ దర్శనాలను రద్దు చేశాం. టోకెన్లు ఉంటేనే భక్తులను దర్శనానికి అనుమతిస్తాం. ఉత్తర ద్వారం నుంచి 7 లక్షల మందికి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశాం." - శ్యామలరావు, తిరుమల దేవస్థానం ఈవో
3 వేల మంది పోలీసులతో భద్రత : తిరుమలలో ట్రాఫిక్ రాకుండా పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వీవీఐపీలకు కేటాయించే టికెట్లపైనే వాహనం పార్కింగ్ చేసే స్థలం, దర్శన చేసుకునే ప్రవేశ మార్గం, పికప్ పాయింట్ల వివరాలను ముద్రించి ఇవ్వనున్నారు. మొత్తం 12వేల వాహనాలను పార్కింగ్ చేసేలా పెద్ద మొత్తంలో స్థలాన్ని ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో 3వేల మంది పోలీసులు, 1550 మంది విజిలెన్స్ సిబ్బందితో పర్యవేక్షణ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు.