Telangana Govt To Release Job Calendar Soon: యూపీఎస్సీ తరహాలో రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఏటా మార్చి 31లోగా అన్ని శాఖల నుంచి వివరాలు సేకరించి జూన్ 2న నోటిఫికేషన్లు ఇచ్చి, డిసెంబర్ 9లోపు భర్తీ ప్రక్రియ పూర్తి చేసేలా చట్టబద్ధత తీసుకురానున్నామని తెలిపారు. కూకట్‌పల్లి జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సాంకేతిక విద్యలో మార్పులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు.
రాష్ట్రంలో యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల భర్తీ చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. త్వరలోనే ఆ అంశాన్ని శాసనసభ వేదికగా సవివరంగా ప్రటిస్తామన్నారు. సాంకేతిక విద్యాశాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ కూకట్‌పల్లి వేదికగా జరిగిన 'నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య' సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'ఏఐ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్ 2024' లోగోను ఆవిష్కరించారు.
'ఏటా దాదాపు లక్ష మంది ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టాలతో కళాశాలల నుంచి బయటికి వస్తున్నారు. వాళ్లలో కొందరికి మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. పరిశ్రమలు, ఐటీ పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యం ఇంజినీరింగ్ విద్యార్థుల్లో లేకపోవడమే ఇందుకు కారణ'మని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దశాబ్దాల క్రితం రూపొందించిన పాఠ్య ప్రణాళికలే ప్రస్తుతం ఇంజినీరింగ్ విద్యలో భోదిస్తున్నారని, విద్యార్థులు చదువుతున్న పాఠాలకు, మార్కెట్‌లో కావాల్సిన నైపుణ్యానికి ఏమాత్రం పొంతన లేకుండా ఉందన్నారు.
గ్రూప్స్ పరీక్షల్లో మార్పులు చేయాలంటూ రోడ్డెక్కిన విద్యార్థి సంఘాలు - అరెస్ట్ చేసిన పోలీసులు - Students Strike in Telangana
యువతలో నైపుణ్యాలను పెంచితే సులభంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ప్రతి రంగంలో కృత్రిమ మేథ ప్రభావం కనిపిస్తోందని, హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి కృత్రిమ మేథ కేంద్రంగా చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికే 200 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఏఐ సిటీగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు పెంచుకోవాల్సిన ఆవశ్యకత గురించి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. కళాశాలల యాజమాన్యాలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై భరోసా ఇవ్వడం ద్వారా, మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యతను సీఎం గుర్తు చేశారు.
హైదరాబాద్‌ను కృత్రిమ మేథ కేంద్రంగా చేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సెప్టెంబర్‌లో నిర్వహించబోతున్న ఏఐ గ్లోబల్ సమావేశానికి సంబంధించిన పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. దేశంలో ప్రస్తుతం బెంగళూర్ నుంచి ఐటీ ఎగుమతులు ఎక్కువగా ఉన్నాయని, రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ను దేశంలో తొలిస్థానంలో నిలిపేలా పని చేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ మేరకు ఇంజినీరింగ్ విద్యార్థులను తీర్చిదిద్దేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇప్పటికే ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్న ప్రభుత్వం, ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ మార్పులకు శ్రీకారం చుట్టనుంది.
ఉద్యోగాలపై కాంగ్రెస్ మాట అప్పుడలా ఇప్పుడిలా : హరీశ్‌రావు - Harish Rao Fires On Congress