తెలంగాణ

telangana

ETV Bharat / state

వ‌ర‌ద న‌ష్టం ప‌నుల‌కు రూ.11,713 కోట్లు విడుద‌ల చేయండి - కేంద్రానికి సీఎం రేవంత్​ విజ్ఞప్తి

వ‌ర‌ద పరిహారం రూ.11,713 కోట్లు ఇవ్వాలని అమిత్‌షాకు సీఎం విజ్ఞప్తి - రాష్ట్ర పునర్విభజన సమస్యలు పరిష్కరించాలని అమిత్‌షాను కోరిన సీఎం - ఐపీఎస్‌ల సంఖ్యను పెంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు విజ్ఞప్తి

CM Revanth On Flood Relief Fund
CM Revanth On Central Flood Fund (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 7, 2024, 9:02 PM IST

Updated : Oct 7, 2024, 9:20 PM IST

CM Revanth On Flood Relief Fund : తెలంగాణ‌లో భారీ వ‌ర్షాల‌తో దెబ్బ‌తిన్న మౌలిక వ‌స‌తుల పున‌రుద్ధ‌ర‌ణ‌, మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌కు రూ.11,713.49 కోట్లు స‌త్వ‌ర‌మే విడుద‌ల చేయాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. దిల్లీలో కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి సోమ‌వారం భేటీ అయ్యారు. తెలంగాణ‌లో ఆగ‌స్టు 31 నుంచి నుంచి సెప్టెంబ‌రు 8వ తేదీ వ‌ర‌కు కురిసిన భారీ వ‌ర్షాలు రాష్ట్రంపై తీవ్ర ప్ర‌భావం చూపాయ‌ని సీఎం తెలిపారు. 37 మంది ప్రాణాలు కోల్పోయార‌ని, ల‌క్ష‌కుపైగా ప‌శువులు, ఇత‌ర మూగ జీవాలు మృతిచెందాయ‌ని, 4.15 ల‌క్ష‌ల ఎక‌రాల్లో పంటతో పాటు రోడ్లు, క‌ల్వ‌ర్టులు, కాజ్‌వేలు, చెరువులు, కుంట‌లు, కాలువ‌లు దెబ్బ‌తిన్నాయ‌ని కేంద్ర మంత్రి షా దృష్టికి ముఖ్య‌మంత్రి తీసుకెళ్లారు.

వ‌ర‌ద పరిహారం రూ.11,713 కోట్లు ఇవ్వండి : మౌలిక వ‌స‌తుల పున‌రుద్ధ‌ర‌ణ‌, మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌ను తాము వెంట‌నే చేప‌ట్టామ‌ని వివ‌రించారు. ఆయా ప‌నుల‌కు రూ.5,438 కోట్లు విడుద‌ల చేయాల‌ని సెప్టెంబ‌రు రెండో తేదీన తాను లేఖ రాసిన విష‌యాన్ని కేంద్ర మంత్రి అమిత్ షాకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. రాష్ట్రంలో పంట‌, ఇత‌ర న‌ష్టాల‌పై కేంద్ర బృందం ప‌ర్య‌టించి మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ.11,713 కోట్ల మేర న‌ష్టం వాటిల్లింద‌ని సెప్టెంబ‌రు 30వ తేదీన నివేదిక స‌మ‌ర్పించింద‌ని సీఎం తెలిపారు. ఆ నిధులు పున‌రుద్ధ‌ర‌ణ‌, మ‌ర‌మ్మ‌తుల ప‌నుల‌కు ఎంత‌మాత్రం స‌రిపోవ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు. వాటిని ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌ల చేయ‌నందున వెంట‌నే ఆ నిధులు విడుద‌ల చేయాల‌ని కోరారు.

2024-25 సంవ‌త్స‌రానికి సంబంధించి ఎస్‌డీఆర్ఎఫ్ మొద‌టి, రెండో విడ‌త‌ల కింద రాష్ట్రానికి రూ.416.80 కోట్ల‌ను కేంద్రం విడుద‌ల చేసింద‌ని ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రికి తెలియ‌జేశారు. పున‌రుద్ధ‌ర‌ణ‌, మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌కు విడుద‌ల చేసే నిధుల‌ను గ‌తంలో ఎస్‌డీఆర్ఎఫ్ ప‌నుల‌కు సంబంధించిన నిధులు ఉప‌యోగానికి ముడిపెట్ట‌వ‌ద్ద‌ని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఎస్‌డీఆర్ఎఫ్‌కు సంబంధించిన నిధుల‌ను ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలోనే వ్య‌యం చేస్తామ‌ని కేంద్ర మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఆ మూడు జిల్లాలను ఎల్‌డబ్ల్యూఈలో కొన‌సాగించాలి

వామ‌ప‌క్ష తీవ్ర‌వాద ప్ర‌భావిత (ఎల్‌డ‌బ్ల్యూఈ) జిల్లాల నుంచి తొల‌గించిన ఆదిలాబాద్‌, మంచిర్యాల‌, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల‌ను ఎల్‌డ‌బ్ల్యూఈలో తిరిగి చేర్చాల‌ని అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఎల్​డబ్ల్యూఈ ప్రభావిత రాష్ట్రాలైన మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ల‌తో తెలంగాణ‌కు సరిహద్దు ఉండటంతో రాష్ట్ర భద్రతపైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. అంత‌ర్గ‌త భ‌ద్ర‌త‌ను దృష్టిలో ఉంచుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం కొండవాయి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాక గ్రామాల్లో సీఆర్ఫీఎఫ్ జేటీఎఫ్ క్యాంపులు ఏర్పాటు చేయాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రికి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఎస్పీవోల‌కు చెల్లించాల్సిన నిధుల్లో కేంద్రం వాటా 60 శాతం నాలుగేళ్ల నుంచి పెండింగ్​లో ఉంద‌ని, ఆ మొత్తం రూ.18.31 కోట్లు విడుదల చేయాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

1,065 మందిని ఎస్పీవోల్లో చేర్చుకోవడానికి నిబంధనలు స‌డ‌లించాలని కోరారు. తెలంగాణ సరిహద్దుల్లోని మ‌లుగు జిల్లా పేరూరు, ములుగు, క‌న్నాయిగూడెం, జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలోని ప‌లిమెల‌, మహ ముత్తారం, కాటారం వంటి పోలీస్ స్టేష‌న్ల‌ను బ‌లోపేతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ పోలీస్ శాఖ కొత్త‌గా నియ‌మితులైన పోలీసు సిబ్బందికి గ్రేహౌండ్స్ ద్వారా తీవ్ర‌వాద వ్య‌తిరేక వ్యూహాల్లో (AET) శిక్ష‌ణ ఇప్పిస్తున్న‌ట్లు ముఖ్య‌మంత్రి తెలిపారు. 2024-25 సంవ‌త్స‌రంలో ఈ ర‌క‌మైన శిక్ష‌ణ‌కు అదనపు బడ్జెట్ రూ.25.59 కోట్లు అవ‌స‌ర‌మ‌ని, ఆ మొత్తాన్ని విడుద‌ల చేయాల‌ని ముఖ్య‌మంత్రి కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. ఆధునిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా పోలీసు ద‌ళాలను తీర్చిదిద్దే ప‌నుల‌కు ఉద్దేశించిన ప్ర‌త్యేక మౌలిక‌వ‌స‌తుల ప‌థ‌కం (ఎస్ఐఎస్‌)కు తెలంగాణ‌కు కేవ‌లం రూ.6.70 కోట్లు మాత్ర‌మే విడుద‌ల చేశార‌ని, అవి ఏమాత్రం స‌రిపోవ‌ని అద‌నంగా రూ.23.56 కోట్లు విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రిని సీఎం కోరారు.

పున‌ర్విభ‌జ‌న స‌మ‌స్య‌లపై :పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర పున‌ర్విభ‌న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి స‌హ‌క‌రించాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు. షెడ్యూల్ 9లోని (చ‌ట్టంలోని 53, 68, 71 సెక్ష‌న్ల ప్ర‌కారం) ప్రభుత్వ భవనాలు, కార్పొరేషన్ల పంపిణీ, షెడ్యూల్ ప‌దిలోని సంస్థ‌ల వివాదం (చ‌ట్టంలోని 75 సెక్ష‌న్ ప్ర‌కారం) సామ‌ర‌స్య‌పూర్వ‌క‌ ప‌రిష్కారానికి కృషి చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. పునర్విభజన చట్టంలో ఎక్క‌డా పేర్కొని ఆస్తులు, సంస్థలను ఆంధ్రప్రదేశ్ క్లెయిమ్ చేసుకుంటున్నందున‌, వాటిలో రాష్ట్రానికి న్యాయం జ‌రిగేలా చూడాల‌ని కేంద్ర మంత్రి షాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కోరారు.

ఐపీఎస్‌ల సంఖ్యను పెంచాలని అమిత్‌షాకు సీఎం విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్రానికి అద‌నంగా 29 అద‌న‌పు ఐపీఎస్ పోస్టులు కేటాయించాల‌ని కేంద్ర మంత్రి అమిత్ షాను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న స‌మ‌యంలో తెలంగాణ‌కు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారుల‌ను మాత్ర‌మే కేటాయించార‌ని తెలిపారు. ఐపీఎస్ క్యాడ‌ర్‌పై రివ్యూ వెంట‌నే చేప‌ట్టాల‌ని కేంద్ర మంత్రిని సీఎం విజ్ఞ‌ప్తి చేశారు. స‌మావేశంలో న‌ల్గొండ ఎంపీ ర‌ఘువీర్ రెడ్డి, దిల్లీలో తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌తినిధి ఏపీ జితేంద‌ర్ రెడ్డి, రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతి కుమారి, ముఖ్య‌మంత్రి ముఖ్య కార్య‌ద‌ర్శి శేషాద్రి, డీజీపీ జితేంద‌ర్ పాల్గొన్నారు.

హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి - కేంద్రమంత్రి ఖ‌ట్ట‌ర్‌కు సీఎం రేవంత్ విన‌తి

సర్కార్​కు షాక్, పడిపోయిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం - హైడ్రా ఎఫెక్ట్ ఏమైనా ఉందా?

Last Updated : Oct 7, 2024, 9:20 PM IST

ABOUT THE AUTHOR

...view details