CM Revanth Reaction On Dogs Attacks in Hyderabad :హైదరాబాద్ జవహర్ నగర్లో వీధి కుక్కలు రెండేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పసికందులు, చిన్నారులపై ప్రతి ఏటా వీధి కుక్కల దాడులకు వాతావరణ పరిస్థితులు లేక సీజనల్ కారణాలా అనే అంశంపై అధ్యయనానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.
మూడేళ్ల చిన్నారిపై కుక్కల దాడి - సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు - Dogs Attack on Three Years Boy
వీధి కుక్కలకు టీకాలు వేయటం, లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో కుక్కలు దాడులు చేసినప్పుడు వెంటనే అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యా రోగ్య శాఖను సీఎం ఆదేశించారు. ఇలాంటి సంఘటనలను నివారించడానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.
ఏం జరిగిందంటే? సికింద్రాబాద్, జవహర్ నగర్ పరిధిలోని దివ్యాంగుల కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడు విహాన్పై విచక్షణారహితంగా దాడి చేశాయి. బాలుడి తల, శరీరంపై తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో కుటుంబసభ్యులు బాలుడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. విహాన్ శరీరం ఇన్ఫెక్షన్కు గురై మృత్యువాత పడినట్లు వైద్యులు తెలిపారు. జవహర్ నగర్లో వీధి కుక్కల బెడద ఉందని పలుమార్లు మున్సిపల్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మృతి చెందిన బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వీధి కుక్కల స్వైర విహారం కారణంగా బయటకు రావాలంటే భయపడాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోయారు.
డేంజర్ డాగ్స్ - ఆడుకుంటున్న బాలుడిపై అటాక్ - తల పీక్కుతిన్న కుక్కలు - SECUNDERABAD BOY DIED IN DOG ATTACK