తెలంగాణ

telangana

ETV Bharat / state

న్యూయార్క్‌, టోక్యో తరహాలో హైదరాబాద్‌ నగర అభివృద్ధి : సీఎం రేవంత్‌రెడ్డి

గ్రేటర్​ హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్న సీఎం రేవంత్

CM Revanth On Hyderabad Development
CM Revanth On Hyderabad Development (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Dec 3, 2024, 7:59 PM IST

CM Revanth On Hyderabad Development :గ్రేటర్​ హైదరాబాద్​ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. న్యూయార్క్‌, టోక్యో తరహాలో ప్రపంచంతో పోటీ పడేవిధంగా హైదరాబాద్‌ నగరాన్ని తీర్చిదిద్దుతున్నామన్నారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు 7వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లుగా రేవంత్ రెడ్డి వివరించారు.

ఎస్‌టీపీలు, ఫ్లైఓవర్లు, నాలాల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాలను పురస్కరించుకొని హైదరాబాద్​లో నిర్వహించిన రైజింగ్‌ వేడుకల్లో ఆయన మాట్లాడారు.

రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్‌ అద్భుత నగరం : ప్రజా పాలన కోసం ఏడాది క్రితం ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని వివరించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిధిని పెంచామని గుర్తు చేశారు. మెట్రోను హైదరాబాద్‌కు తీసుకొచ్చింది కాంగ్రెస్సేనన్న రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆదాయంలో 60 శాతం హైదరాబాద్‌, రంగారెడ్డి నుంచే వస్తుందని పేర్కొన్నారు.

రీజినల్‌ రింగ్‌ రోడ్డు తెలంగాణకే మణిహారమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. రూ.35 వేల కోట్లతో 360 కి.మీ రీజినల్‌ రింగ్‌ రోడ్డుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ఇబ్రహీంపట్నంలో అంతర్జాతీయ పండ్ల మార్కెట్‌ను నిర్మించబోతున్నామని వివరించారు. ఓఆర్ఆర్‌కు అనుబంధంగా ముచ్చర్ల ప్రాంతంలో ఫ్యూచర్‌ సిటీ నిర్మిస్తామని తెలిపారు. 40 నుంచి 50 వేల ఎకరాల్లో అద్భుతంగా ఫ్యూచర్‌ సిటీని నిర్మిస్తాం అని ఆయన పునరుద్ఘాటించారు. టోక్యో, న్యూయార్క్‌తో పోటీ పడేలా నిర్మిస్తామన్న రేవంత్ రెడ్డి రూ.లక్షన్నర కోట్లు ఖర్చు పెడితే హైదరాబాద్‌ అద్భుత నగరం అవుతుందని రేవంత్ వివరించారు.

హైదరాబాద్‌కు కిషన్‌ రెడ్డి ఏం తెచ్చారు? :గత ముఖ్యమంత్రి అబద్ధాలతో గడిపేశారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. పాతబస్తీని ఇస్తాంబుల్ చేశామన్నారన్న సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధికి గత ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కాలుష్యం పెరిగి దిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై, కోల్‌కతా నగరాలు నివసించేందుకు వీలు లేకుండా మారాయని రేవంత్ రెడ్డి తెలిపారు. 10 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసే విధంగా వాటర్‌ హార్వెస్టింగ్‌ బావులను నిర్మిస్తున్నామని ఆయన వెల్లడించారు. తమ ప్రభుత్వ హయాంలో రియల్​ఎస్టేట్​(స్థిరాస్తి) వ్యాపారం 29 శాతం పెరిగిందన్నారు. అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చుతోందని రేవంత్ తెలిపారు. మూసీ పునరుజ్జీవనం చేయకుండా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అడ్డుకుంటున్నారని విమర్శించారు.

మోదీని ఒప్పించి నిధులు తీసుకురండి :నగర అభివృద్ధిపై బీజేపీ, బీఆర్ఎస్ దొందుదొందుగానే తయారయ్యాని ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనకు హుస్సేన్ సాగర్ లోని నీళ్లు అద్దంపడుతున్నాయని దుయ్యబట్టారు. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న బీజేపీ కిషన్ రెడ్డి మోదీని ఒప్పించి లక్షన్నర కోట్ల నిధులు తీసుకురావాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నగరంలో శాశ్వత ప్రతిపాదికన మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం పనులు చేయాలంటే లక్షన్నర కోట్లు అవసరం అవుతాయన్న రేవంత్ రెడ్డి ఆ నిధులను తీసుకొస్తే 10 లక్షల మంది సమక్షంలో మోదీని, కిషన్ రెడ్డిని సన్మానిస్తామని ప్రకటించారు. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనపై బీజేపీ తమ విధానాన్ని చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ప్రభుత్వంపై కక్ష్య ఉంటే వేరే రకంగ చూసుకోవాలని, హైదరాబాద్ ను అడ్డుకోవద్దని రేవంత్ రెడ్డి హితవు పలికారు. బీజేపీ, బీఆర్ఎస్ నగర అభివృద్ధిపై తమ విధానాలను వెల్లడించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో ఉప సంఘం ఉంటుందని, అఖిల పక్షంతో కలిసి వచ్చి నగర అభివృద్ధిపై పాలసీ డాక్యుమెంట్ ను తెలంగాణ సమాజానికి చూపించాలని సీఎం కోరారు.

ABOUT THE AUTHOR

...view details