Microsoft Launches New Campus In Gachibowli :హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏఐ సెంటర్ ఏర్పాటుకు సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
యువతకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయి :క్యాంపస్ ప్రారంభించిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌తో మైక్రోసాఫ్ట్ సంస్థకు సుదీర్ఘ అనుబంధం ఉందని అన్నారు. భవిష్యత్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)దే అని తెలిపారు. మైక్రోసాఫ్ట్ కృషిలో 500 పాఠశాలల్లో ఏఐని వినియోగిస్తూ బోధన కొనసాగుతోందని, మైక్రోసాఫ్ట్ విస్తరణ ద్వారా తెలంగాణలో యువతకు మరిన్ని ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు.
మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు సీఎం ధన్యవాదాలు :హైదరాబాద్ జర్నీలో మైక్రోసాఫ్ట్ నూతన క్యాంపస్ ప్రారంభం మరో మైలురాయని, మైక్రోసాఫ్ట్ పెట్టుబడి స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వ సహకారంతో మైక్రోసాఫ్ట్ ఏఐ సెంటర్ ఏర్పాటు చేస్తుందని, ఏఐ మౌలిక సదుపాయాలను మైక్రోసాఫ్ట్ కేంద్రం అభివృద్ధి చేస్తుందని అన్నారు. తెలంగాణ రైజింగ్ విజన్‌కు మైక్రోసాఫ్ట్ నిబద్ధత తోడ్పడుతుందని తెలిపారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ ప్రతినిధులకు సీఎం ధన్యవాదాలు తెలిపారు.