CM Revanth Review On River Water Projects :కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాలను దక్కించుకోవాలని రాష్ట్ర ప్రయోజనాలకు వీసమెత్తు నష్టం వాటిల్లకుండా ట్రైబ్యునల్ ఎదుట సమర్థ వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన సాక్ష్యాధారాలు, రికార్డులు, ఉత్తర్వులు సిద్ధంగా ఉంచుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులు, న్యాయ నిపుణులకు స్పష్టం చేశారు.
నదీజలాల అంశంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష :నీటిపారుదల ప్రాజెక్టులు, నదీజలాల అంశాలపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టాండింగ్ కౌన్సిల్ వైద్యనాథన్, ఏజీ సుదర్శన్ రెడ్డి, అదనపు ఏజీ రజనీకాంత్ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది ఖుష్ వోరా, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఉన్నతాధికారులు, ఈఎన్సీలు సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో సాగునీటి పరిస్థితి, కృష్ణా - గోదావరి జలాలపై ఉన్న అంతర్ రాష్ట్ర వివాదాలు, నీటి వాటాల పంపిణీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.
విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య నీటి వాటాలు, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయించాల్సి ఉందని త్వరలోనే రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు. కృష్ణా జలాలకు సంబంధించి ట్రైబ్యునల్ తీర్పులు, డీపీఆర్‌ల గురించి ఆరా తీసిన ముఖ్యమంత్రి జలశక్తి మంత్రిత్వ శాఖకు ఇచ్చిన నివేదికలన్నింటినీ వరుస క్రమంలో సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వాటి ఆధారంగా ట్రైబ్యునల్ ఎదుట పకడ్బందీగా వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు.
కృష్ణా జలాల్లో 70 శాతం వాటా రాష్ట్రానికి దక్కేలా :అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారం నదీ పరివాహక ప్రాంత దామాషా ప్రకారం నీటి కేటాయింపులు ఉండాలన్న రేవంత్ రెడ్డి కృష్ణా పరీవాహక ప్రాంతం తెలంగాణలో 70 శాతం ఉండగా, ఏపీలో కేవలం 30 శాతం ఉందని అన్నారు. ఆ ప్రకారం 1005 టీఎంసీల కృష్ణా జలాల్లో 70 శాతం నీటివాటా తెలంగాణకు దక్కేలా వాదనలు వినిపించాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను ఏపీ కృష్ణా డెల్టాకు వినియోగిస్తున్నందున, అందుకు బదులుగా నాగార్జునసాగర్ ఎగువన 45 టీఎంసీలు తెలంగాణకు నీటి కేటాయింపులు ఉన్నాయని ఆ వాటాను ఎగువన ఉన్న ప్రాజెక్టుల ద్వారా వినియోగించుకునే ప్రణాళికను అమలు చేయాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.