తెలంగాణ

telangana

ETV Bharat / state

టీటీడీ తరహాలో యాదగిరిగుట్టకు టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయండి : సీఎం రేవంత్ కీలక ఆదేశాలు - Yadagirigutta Temple Board

CM Revanth Reddy Review on Yadadri Temple : 'స్పీడ్' ప్రాజెక్టులపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలోనే హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజం అభివృద్ధిపై అధికారులతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి, టీటీడీ బోర్డు మాదిరిగా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Review on Yadadri Temple (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 4:33 PM IST

Updated : Aug 31, 2024, 6:31 AM IST

CM Revanth Reddy Review on Speed Projects : రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్దికి కొత్త విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టూరిజంలో, ముందంజలో ఉన్న ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై అధ్యయనం చేసి వాటిలో తెలంగాణకు అనువుగా ఉన్న వాటిని అనుసరించాలని సీఎం సూచించారు. పర్యాటక అభివృద్ధిపై సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధికి వేర్వేరుగా పాలసీలను రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రంలోని ప్రాచీన ఆలయాలు, చారిత్రక స్థలాలు, అటవీ ప్రాంతాలు, వైద్య సదుపాయాలన్నింటినీ పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రవాణా, వసతి, పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయాలు ఉండేలా కొత్త టూరిజం ప్యాకేజీలుండాలని సీఎం చెప్పారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. కొన్ని చోట్ల రాత్రి విడిది ఉండేలా కాటేజీలను నిర్మించాలన్నారు. పర్యాటకానికి అనువైన ప్రాంతాలన్నీ గుర్తించి.. వేటిని ముందుగా అభివృద్ధి చేయాలో టూరిజం, దేవాదాయ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో ప్రణాళిక చేయాలని సీఎం చెప్పారు.

తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో బోర్డు :తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. టీటీడీ తరహాలోనే యాదగిరిగుట్ట బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలావరకు అర్థంతరంగా ఉన్నాయని సీఎం తెలిపారు. అలా ఆగిపోవడానికి వీల్లేదని వాటిని కొనసాగించాలని స్పష్టం చేశారు.

యాదగిరిగుట్టలో ఇప్పటివరకు ఏయే అభివృద్ధి పనులు జరిగాయి, అసంపూర్తిగా ఏమి ఉన్నాయనే వివరాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని సీఎం ఆదేశించారు. యాదగిరిగుట్టకు వచ్చే భక్తుల సౌకర్యాలు, కాటేజీల నిర్మాణాలకు దాతలు, కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని యాదగిరిగుట్టను అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చెప్పారు.

కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయాన్ని రామప్ప ఆకృతిలో నిర్మాణం : కీసరగుట్ట రామలింగేశ్వర ఆలయాన్ని రామప్పగుడి ఆకృతితో అద్భుతంగా పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ బయట సుమారు వెయ్యి ఎకరాల్లో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి జంతువులు, పక్షులను తీసుకు రావాలని చెప్పారు. జామ్​నగర్​లో అనంత్ అంబానీ 3వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. అలా ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలు, సంస్థలను ఆహ్వానించాలని అధికారులకు చెప్పారు.

అనంతగిరి ప్రాంతంలో అద్భుతమైన ప్రకృతి అటవీ సంపద ఉన్నందున, అక్కడ 200 ఎకరాల ప్రభుత్వ భూముల్లో హెల్త్ టూరిజం అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బెంగుళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్సిట్యూట్ తరహాలో నేచర్ వెల్‌నెస్‌సెంటర్ అక్కడ ఏర్పాటు చేయాలనే చర్చ జరిగింది. అనంతగిరిలో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు జిందాల్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపాలని, అదేవిధంగా ప్రకృతి వైద్య రంగంలో పేరొందిన ప్రముఖ సంస్థలను ఆహ్వానించాలని సీఎం సూచించారు. హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఫోర్త్ సిటీలోని హెల్త్ హబ్‌లో సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు, తగిన ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారుచేయాలని సీఎం చెప్పారు.

వైద్య సేవలందించే వన్‌స్టాప్ సొల్యూషన్ ప్యాకేజీలు రూపొందించాలి :వివిధ దేశాల నుంచి వచ్చేవారికి వైద్య సేవలందించే వన్‌స్టాప్ సొల్యూషన్ ప్యాకేజీలు రూపొందించాలన్నారు. ఆన్‌లైన్‌లోనే అన్ని సేవల వివరాలను అందుబాటులో ఉంచాలని... నేరుగా ఎయిర్ పోర్ట్ నుంచి హాస్పిటల్‌కు వెళ్లి, డాక్టర్ల అపాయింట్‌మెంట్‌, ట్రీట్మెంట్ తీసుకునేలా సదుపాయాలన్నీ ఉండాలని సూచించారు. దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్‌ను మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలని అన్నారు. హరిత హోటళ్లు, వసతి గృహలు నిర్మించి వదిలేస్తే సరిపోదని, వాటి నిర్వహణ మెరుగ్గా ఉంటేనే పర్యాటకులను ఆకర్షిస్తాయని సీఎం అధికారులను అప్రమత్తం చేశారు. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులన్నింటినీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టాలని సూచించారు. ఉద్యోగాల కల్పనతోపాటు రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేలా టూరిజం అభివృద్ధి జరగాలని సీఎం స్పష్టం చేశారు.

స్కిల్ యూనివర్సిటీ డిజైన్లను పరిశీలించిన సీఎం రేవంత్

గోషామహల్​లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి - పేట్లబుర్జుకు పోలీస్​ స్టేడియం తరలింపు - New Osmania Hospital at Goshamahal

Last Updated : Aug 31, 2024, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details