తెలంగాణ

telangana

ETV Bharat / state

పంచాయతీ ఎన్నికలు త్వరలోనే - క్లారిటీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి - CAST CENSUS IN TELANGANA

ఫిబ్రవరి 2 నాటికి రిపోర్టును సమర్పించనున్నట్లు తెలిపిన డెడికేటెడ్ కమిషన్ - స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై నివేదిక సిద్ధం చేసిన కమిషన్ - నివేదిక అందిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు

LOCAL BODY ELECTIONS
CM REVANTH REDDY (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jan 29, 2025, 5:35 PM IST

Updated : Jan 29, 2025, 7:57 PM IST

CM Revanth Reddy on Local Body Elections : సమగ్ర కుల గణన సర్వే విశ్లేషణ కొలిక్కి వచ్చింది. ఫిబ్రవరి 2 నాటికి నివేదిక సమర్పించనున్నట్లు డెడికేటెడ్ కమిషన్ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపారు. ముసాయిదా నివేదిక రెండు రోజుల్లో ఇవ్వనున్నట్లు వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక అందిన తర్వాతే పంచాయతీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ లెక్కన పంచాయతీ ఎన్నికలు ఫిబ్రవరి నెలలో జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు సమీక్షలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రభుత్వానికి అందిన తర్వాత మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు.

కోటి 16 లక్షల నివాసాల్లో సర్వే : డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత మంత్రివర్గ సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి 16 లక్షల 14 వేల 349 నివాసాల్లో 2024 నవంబరు 9 నుంచి సుమారు 87వేల మంది 76 ప్రశ్నలతో రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి, కుల గణన సర్వేను నిర్వహించారు.

బీసీ రిజర్వేషన్లు ఖరారు! : రాష్ట్ర ప్రణాళిక విభాగం చేపట్టిన సమగ్ర సర్వేలో తేలిన గణాంకాలను విశ్లేషించిన డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై నివేదికను సిద్ధం చేసింది. రాష్ట్రంలో బీసీలు సుమారు 55 శాతం ఉన్నట్లుగా సర్వేలో తేలినట్లు సమాచారం. పంచాయతీ ఎన్నికలపై బుధవారం (జనవరి 29న) నిర్వహించిన సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు వివరాలను తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు.

కులగణనపై జాతీయ స్థాయిలో ప్రశంసలు : సామాజిక సాధికారతతో పాటు కులగణన సర్వే భవిష్యత్తులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బలహీన వర్గాల అభ్యున్నతికి ఉపయోగపడుతుందన్నారు. సర్వే విజయవంతంగా నిర్వహించారని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వేపై జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఇచ్చిన మాట ప్రకారమే : ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కుల గణన సర్వేను చేపట్టి తమ చిత్తశుద్ధిని చాటుకుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్​లో నిర్వహించిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్కమార్క, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు : కుటుంబ సభ్యుల వారీగా విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపారం, వార్షికాదాయం, భూములు, ఇళ్లు, ఇతర స్థిర, చరాస్తులు, పొందిన రిజర్వేషన్ ప్రయోజనాలు సంక్షేమ పథకాల లబ్ది, తీసుకున్న రుణాలు తదితర వివరాలు సేకరించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ ఈ గణాంకాలను వినియోగించుకోనుంది.

త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు! - ఎక్కడికి వెళ్లకుండానే ఓటర్​ లిస్ట్​లో మీ పేరు ఇలా చెక్​ చేసుకోండి!

పంచాయతీ నగారా మోగనే లేదు - అప్పుడే 16 హామీలతో మేనిఫెస్టో

Last Updated : Jan 29, 2025, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details