CM Revanth On Local Body Elections 2025 : తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లేందుకు క్షేత్రస్థాయిలో నాయకులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా పార్టీ బలాబలాలు ఏవిధంగా ఉన్నాయో ఆరా తీశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంఛార్జీలు, స్థానిక నాయకత్వాల మధ్య ఉన్న అంతరాలు, తదితర అంశాలపై ఆరా తీశారు.
మన్మోహన్‌సింగ్‌కు భారత రత్న :అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ మృతికి సంతాపం తెలపడం కోసం తెలంగాణ అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మన్మోహన్‌సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశామని వివరించారు. మన్మోహన్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చిందన్నారు. పాతబస్తీలో కొత్తగా నిర్మించిన ఫ్లైఓవర్‌కు మన్మోహన్సింగ్ పేరు పెట్టామని తెలిపారు. ఈ జనవరి 26వ తేదీన రైతు భరోసా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు, కొత్త రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.
రూ.21 వేల కోట్ల రుణమాఫీ :ఏడాదిలో 55,143 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. రూ.21 వేల కోట్ల రుణమాఫీ చేశామని, ఒక్క సంవత్సరంలోనే రూ.54 వేల కోట్లు రైతుల సంక్షేమం కోసం ఖర్చు చేసినట్లు వివరించారు. రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు రూ.4,000 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించినట్లు తెలిపారు.