CM Revanth On Hyderabad Traffic :గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యపై పోలీసు ఉన్నతాధికారులతో సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు మూడు నెలల్లో హోంగార్డులను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఇతర విభాగాల్లో పని చేస్తున్న హోంగార్డులను వెనక్కి పిలిపించి ట్రాఫిక్ నియంత్రణ విధులకు వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
వాహనాల రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను కూడా ట్రాఫిక్ నియంత్రణ విధులకు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ స్థాయిని అప్గ్రేడ్ చేసి తగిన సంఖ్యలో సిబ్బంది ఉండేలా పునర్వ్యవస్థీకరించాలని తెలిపారు. పెరుగుతున్న జనాభా వాహనాల వినియోగం దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలపై చర్యలు చేపట్టాలన్నారు.
వాహనాల పెండింగ్ చలాన్ల గడువు మరోసారి పొడిగింపు - ఎప్పటివరకంటే
సిటీలో రహదారులు, జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. రద్దీ ఎక్కువగా ఉండే కూడళ్లలో ఎల్బీనగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే నిర్మాణాలు చేపట్టే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. కూడళ్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కేవలం ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థపైనే ఆధారపడకుండా ట్రాఫిక్ సిబ్బంది (Hyderabad Traffic Problems) కూడా అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పారు.