CM Revanth Speech in Assembly : 'సినిమాలు తీసుకోండి.. వ్యాపారం చేసుకోండి.. డబ్బులు సంపాదించుకోండి.. ప్రభుత్వం నుంచి రాయితీలు, ప్రోత్సాహకాలు తీసుకోండి.. షూటింగ్‌కు సంబంధించి ప్రత్యేక అనుమతులు కూడా తీసుకోండి.. కానీ ప్రజల ప్రాణాలు పోతుంటే మాత్రం ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు" అని సినిమా ప్రముఖులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు పంపారు. తాను కుర్చీలో ఉన్నంత వరకు ఇలాంటి ఘటనలు ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలు పోయే ఘటనలు జరిగితే ప్రత్యేక మినహాయింపులు ఉండవని తేల్చి చెప్పారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటనపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై పోలీసుల విచారణ కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈనెల 4న పుష్ప -2 విడుదలవుతుందని, అదే రోజు హీరో, హీరోయిన్, సినీ నిర్మాణ సిబ్బంది వస్తారని బందోబస్తు కావాలని సంధ్య థియేటర్ యాజమాన్యం ఈనెల 2న చిక్కడపల్లి పీఎస్‌లో దరఖాస్తు చేశారని చెప్పారు. ఈనెల 3న థియేటర్ రాసిన లేఖకు పోలీసులు రాతపూర్వక సమాధానం ఇచ్చారన్నారు.
సంధ్యా థియేటర్‌కు వెళ్లి, రావడానికి ఒకే మార్గం ఉందని, చుట్టు పక్కల ఇతర థియేటర్లు, రెస్టారెంట్లు ఉన్నాయని అందులో తెలిపారని వివరించారు. సంధ్య థియేటర్ పరిసరాల పరిస్థితుల దృష్ట్యా సెలబ్రిటీలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారని సీఎం అసెంబ్లీలో వెల్లడించారు. వచ్చే జనాలను నియంత్రించడం సాధ్యం కాదని చెప్పారని సభలో సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
పోలీసులు వద్దన్నా హీరో వచ్చారు :సంధ్య థియేటర్ యాజమాన్యం ఇచ్చిన లేఖను తిరస్కరించామని సీఎం రేవంత్ రెడ్డి సభలో చెప్పారు. ఈనెల 2న సంధ్య థియేటర్ యాజమాన్యం లేఖ ఇస్తే 3న తిరస్కరించామన్నారు. అయినా వాహనం రూఫ్‌టాఫ్ నుంచి చేతులు ఊపుతూ ర్యాలీ చేశారన్నారు. హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్ థియేటర్‌కు రావొద్దని అప్పుడే చెప్పామన్నారు. కానీ పోలీసులు దరఖాస్తు తిరస్కరించినా రాత్రి 9.30 గంటల సమయంలో హీరో థియేటర్‌కు వచ్చారని సీఎం వివరాలు వెల్లడించారు.
నేరుగా థియేటర్‌కు వచ్చి సినిమా చూసి వెళ్లిపోతే ఈ ఘటన జరిగేదే లేదో నాకు తెలియదని సీఎం చెప్పారు. ఎక్స్ రోడ్డు చౌరస్తా ముందే నుంచి రూఫ్‌టాఫ్ ద్వారా రోడ్ షో చేస్తూ థియేటర్‌కు వచ్చారని పేర్కొన్నారు. ఆ సమయంలో చుట్టూ ఉన్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న అభిమానులు ఇక్కడికే వచ్చారన్నారు. దీంతో హీరో కారు లోపలకు పంపించేందుకు గేటు తెరిచారన్నారు.
"నేరుగా థియేటర్‌కు వచ్చి సినిమా చూసి వెళ్లిపోతే ఈ ఘటన జరిగేదే లేదో నాకు తెలీదు. ఎక్స్‌రోడ్డు చౌరస్తా ముందే నుంచి రూఫ్‌టాఫ్ ద్వారా రోడ్ షో చేస్తూ థియేటర్‌కు వచ్చారు. ఆ సమయంలో చుట్టూ ఉన్న ఏడెనిమిది థియేటర్లలో ఉన్న అభిమానులు ఇక్కడికే వచ్చారు. హీరో కారు లోపలకు పంపించేందుకు గేటు తెరిచారు. హీరోను కలిసేందుకు వేలాదిగా ఒకేసారి థియేటర్‌వైపు వచ్చారు. ఆ సమయంలో జరిగిన ఘటనలో రేవతి చనిపోయారు. హీరోను చూడాలి.. కలవాలని అభిమానులు రావడంతో.. హీరో సిబ్బంది నెట్టివేయడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో తల్లి చనిపోయింది.. కుమారుడు చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన వెంటనే తల్లి, కుమారుడిని రక్షించేందుకు పోలీసులు యత్నించారు." - రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి