Allu Arjun Police Investigation :హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకూ 18 మందిని నిందితులుగా చేర్చగా ఏ-11గా ఉన్న అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి ఠాణాలో విచారణకు హాజరయ్యారు. దాదాపు మూడున్నర గంటలపాటు విచారించిన పోలీసులు, వివిధ అంశాలపై ఆయనను ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. అవసరమైతే సీన్ రీ కంస్ట్రక్షన్‌లో భాగంగా సంధ్య థియేటర్‌కు రావాల్సి ఉంటుందని పోలీసులు అల్లు అర్జున్‌కు తెలిపారు. ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి విచారణ ముగిసి తిరిగి ఇంటికి చేరుకున్నంత వరకూ అల్లు అర్జున్‌కు భారీ బందోబస్తు కల్పించారు.
తండ్రి అల్లు అరవింద్‌తో కలిసి చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో అల్లు అర్జున్ విచారణకు హాజర్యయారు. న్యాయవాది మినహా మరెవరినీ పోలీసులు లోపలికి అనుమతించలేదు. తొక్కిసలాటకి ముందు, అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు 20కు పైగా ప్రశ్నలు సంధించారు. సుమారు మూడున్నర గంటల పాటు పలు అంశాలను ప్రస్తావించిన పోలీసులు అల్లు అర్జున్ నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పగా విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ తెలిపారు. రేవతి మరణించిన విషయం తనకు ఎవరూ చెప్పలేదని అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. ప్రీమియర్ షోకు హాజరయ్యేందుకు వచ్చిన తమకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలియదని పోలీసులకు బన్నీ తెలిపారు.