Chariot Fire In Anantapur District :అనంతపురం జిల్లా కనేకల్ మండలం హనకనహాల్‌లో రాములవారి రథానికి దుండగులు నిప్పు పెట్టారు. అర్ధరాత్రి అగ్నికీలలు గుర్తించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పారు. అప్పటికే సగానికిపైగా రథం కాలిపోయింది. అనంతపురం ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు పోలీసులు రథాన్ని పరిశీలించి క్రిమినల్ కేసు నమోదు చేశారు.
CM Chandrababu About Chariot Fire In Anantapur District :పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి కేసు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. రథం దహనంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. ఘటనా స్థలికి వెళ్లి విచారణ చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సమగ్ర దర్యాప్తు చేయాలని, వివరాలను ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని ఆదేశించారు. నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని సీఎం స్పష్టం చేశారు.
అర్ధరాత్రి ఆలయ రథం దహనం - సమగ్ర దర్యాప్తుకు సీఎం ఆదేశం
'స్థానిక గొడవల కారణంగానే రథం దహనం చేసినట్లు అనుమానిస్తున్నాం. గ్రామ కక్షలు, పొరపొచ్చాలు తప్ప ఈ ఘటన వెనుక వేరే ఏ కోణం లేదు. దర్యాప్తు ముమ్మరం చేశాం. అతి త్వరలో కేసును చేధిస్తాం.' - రవిబాబు, కళ్యాణదుర్గం డీఎస్పీ
ఇది కేవలం స్థానిక గొడవల కారణంగా జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తేరు కాలిన ప్రదేశంలో విలువైన సమాచారం సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. వేలిముద్రలు గుర్తించామన్నారు. వాటి ఆధారంగా నింధితుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఆధారాలు సేకరించడానికి డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్లను రప్పిస్తున్నట్లు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు పేర్కొన్నారు. వీలైనంత త్వరగా ఈ కేసును చేధిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రథానికి దుండగులు నిప్పు పెట్టడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, జరిగిన ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సున్నితమైన అంశమైనందున జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులకు డీఎస్పీ సూచించారు.