Central Minister Kishan ReddyLetter To CM Revanth Reddy : రాష్ట్రంలో సొంతిళ్లు అవసరం ఉన్న పేదల జాబితాను కేంద్రానికి అందించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల కోసం నిర్వహించనున్న సర్వేలో పాల్గొనాలని కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. కనీసం 10 కోట్ల మందికి లబ్ధిని చేకూర్చాలని ఈ నెల 9న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన - గ్రామీణ పథకం ఫలాలను ఆయా కుటుంబాలకు అందించి వారి సొంతింటి కలను సాకారం చేయడంలో సంపూర్ణ సహకారం అందిస్తారని కోరుకుంటున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.
ప్రధామంత్రి ఆవాస్ యోజన :ఈ మేరకు కేంద్రమంత్రి సీఎం రేవంత్ రెడ్డికి ప్రధామంత్రి ఆవాస్ యోజన- గ్రామీణ పథకం ఫలాల విషయంలో లేఖ రాసారు. గ్రామీణ భారతదేశంలోని ప్రతి ఒక్కరు సొంతింటి కలను సాకారం చేయడానికి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకాన్ని 2016 లో ప్రారంభించిందని తెలిపారు. పథకం ప్రారంభ సమయంలో గ్రామీణ భారతదేశంలోని సొంతిల్లు లేని పేద కుటుంబాలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మార్చి 2024 నాటికి 2.95 కోట్ల పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని వివరించారు.
10 కోట్ల మందికి లబ్ధి చేకూర్చాలా ప్రణాళికలు : మొదటి విడత గడువు ముగిసిన ఈ పథకాన్ని కొనసాగిస్తూ రెండవ విడతలో భాగంగా ఏప్రిల్ 2024 నుండి మార్చి 2029 మధ్య కాలంలో మరో 2 కోట్ల పక్కా ఇళ్లను సొంతిల్లు అవసరమున్న గ్రామీణ ప్రాంత పేద కుటుంబాలకు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. తద్వారా కనీసం 10 కోట్ల మందికి లబ్ధిని చేకూర్చాలని ఈ నెల 9న జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.